బల్దియాలపై ఎగిరేది గులాబీ జెండానే
● కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ● ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో ము న్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాణిక్యరావు, సునీతారెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, 17 మున్సిపాలిటీల ఎన్నికల ఇన్‌చార్జిలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈసందర్భంగా హరీశ్‌రావు మా ట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, పల్లెల నుంచి పట్టణాల వరకు పాలన అంతా అస్తవ్యస్తంగా మారిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతితో దేశానికి ఆదర్శంగా నిలిచిన మన మున్సిపాలిటీలు, నేడు నిర్వహణ లేక కళ తప్పాయని వాపోయారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణాల అభివృద్ధి కోసం ప్రతినెలా క్రమం తప్పకుండా నిధులు విడుదల అయ్యాయని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వక, ఉన్నవాటిని నిర్వహించలేక పట్టణాలను గాలి కొదిలేసిందని విమర్శించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించామని.. నేడు కనీసం ఆ తాగునీటి సరఫరాను నిర్వహించడం కూడా చేతకావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని హరీశ్‌రావు చెప్పారు.


