క్యూఆర్‌టీ సిబ్బంది పనితీరు భేష్
మెదక్ మున్సిపాలిటీ: క్యూఆర్‌టీ సిబ్బంది పనితీరు భేష్‌గా ఉందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో క్యూఆర్‌టీ బృందాన్ని అభినందించి క్యాష్ రివార్డు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాపన్నపేట మండలం ఏడుపాయల్లో ఆదివారం కామారెడ్డి జిల్లాకు చెందిన బసవయ్య అనే వ్యక్తి మంజీరాలో దూకి ఆత్మహత్యకు యత్నించగా, అక్కడే విధులు నిర్వర్తిస్తున్న క్యూఆర్‌టీ–1 సిబ్బంది వెంటనే స్పందించారని తెలిపారు. ప్రమాదకరమైన నది ప్రవాహాన్ని లెక్కచేయకుండా చాకచక్యంగా వ్యవహరించి ఆ వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చి ప్రాణాలను కాపాడారని కొనియాడారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా ఆదనపు ఎస్పీ మహేందర్, ఆర్‌ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


