పేకాట, కోడి పందేలకు తావు లేదు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా పరిధిలో పేకాట, కోడి పందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలను పూ ర్తిగా నియంత్రించేందుకు పోలీస్‌శాఖ కఠిన చర్యలు చేపడుతుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ తరహా అక్రమ కార్యకలాపాలు శాంతిభద్రతలకు భంగం కలిగించడమే కాకుండా యువతను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందన్నారు. అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో నిరంతర వాహన తనిఖీలు, గస్తీ ముమ్మరం చేశామన్నారు. పేకాట, కోడి పందేలు నిర్వహించే వారిపై చట్ట ప్రకారం కేసులు నమో దు చేస్తామన్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి సమాచారమిస్తే వెంటనే చర్యలు చేపడతామన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు, వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు


