ఆలోచన అదిరె.. విద్యార్థులు మురిసె
మెదక్‌జోన్: మనసుంటే మార్గం ఉంటుందని, అది పది మందికి ఉపయోగపడుతుందని నిరూపించా రు జిల్లా పాలనాధికారి రాహుల్‌రాజ్. నూతన సంవత్సర వేళ అధికారులు, యూనియన్ నాయకులు, ప్రజాప్రతినిధులు, తనను కలిసేందుకు వచ్చే వారు శాలువాలు, పుష్పగుచ్ఛాలకు బదులు దుప్పట్లు తీసుకురావాలని సూచించారు. ఆయన నోటి నుంచి మాట రావటమే ఆలస్యం వేలాదిగా దుప్పట్లు వచ్చి చేరాయి. వాటిని వసతి గృహాల్లో చదువుకునే పేద విద్యార్థులకు అందిస్తున్నారు. జిల్లాలోని సుమారు 56 శాఖల అధికారులతో పాటు టీచర్స్ యూనియన్ నేతలు, రాజకీయ నాయకులు భారీ గా దుప్పట్లు తీసుకొచ్చారు. ఇప్పటివరకు సుమారు 1,900 పైచిలుకు దుప్పట్లు రాగా, వాటిని విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. మెదక్‌లో చలితీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఉపశమనం కలగనుంది. గతంలోనూ అధికారుల నుంచి ఇదే మాదిరిగా నోట్ బుక్కులు, పెన్నులు స్వీకరించి వసతిగృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు కలెక్టర్ పంపిణీ చేశారు. తన పిలుపు మేరకు అధికారులు స్పందించటం గర్వంగా ఉందని, ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండటంతో పలువురు అందించే దుప్పట్లు వసతిగృహ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నా యని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు.


