జలం.. సాగుకు బలం
7.79 మీటర్ల లోతులోనే నీటిమట్టం
యాసంగికి ఢోకా లేదంటున్నఅధికారులు
జిల్లాలో సమృద్ధిగా భూగర్భజలాలు
మెదక్‌జోన్: జిల్లాలో వానాకాలంలో సమృద్ధిగా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వెరసి జిల్లా అంతటా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా సాధారణ వర్షపాతం కంటే 80 శాతం అధికంగా నమోదు అయింది. దీంతో ఈ యాసంగి సాగుకు ఢోకా లేదని అధికారులు చెబుతున్నారు.
పాపన్నపేటలో ౖపైపెనే..
జిల్లాలో వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం 7.79 మీటర్లలోతులో నీటిమట్టం ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇందులో పాపన్నపేట మండలంలో 4.58 మీటర్లలోతులోనే జలాలు ఉండగా, తూప్రాన్‌లో 10.84 మీటర్లలో ఉన్నాయి. అల్లాదుర్గం 9.89, చేగుంట, 7.20, చిలప్‌చెడ్ 9.13, హవేళిఘణాపూర్ 5.59, కౌడిపల్లి 9.10, కొల్చారం 9.61, మనోహరాబాద్ 5.08, మాసాయిపేట 10.40, మెదక్ 7.15, నర్సాపూర్ 8.83, నార్సింగి 14.40, నిజాంపేట 7.85, పాపన్నపేట 4.58, రామాయంపేట 9.47, రేగోడ్ 11.52, పెద్దశంకరంపేట 8.22, చిన్నశంకరంపేట 10.05, శివ్వంపేట 6.26, టేక్మాల్ 5.06, తూప్రాన్ 10.85, వెల్దుర్తి 5.15 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. కాగా గడిచిన రెండు దశాబ్దాలతో పోలిస్తే ఇంత పైన నీరు ఎప్పుడూ లేదని అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది ఇదే సమయంలో 9.95 మీటర్లలోతులో జలాలు ఉండగా, ఈ ఏడాది 2.16 మీటర్ల జలం పైన ఉండటం రైతాంగానికి ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. వర్షాకాలం ప్రారంభం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం జిల్లావ్యాప్తంగా 772 మిల్లీ మీటర్లు కాగా, సగటున 1,390.30 మి.మీ కురిసింది. ఈ లెక్కన 668.30 మి.మీ వర్షం అదనంగా నమోదైంది. కురవాల్సిన దాని కంటే 80 శాతం ఎక్కువగా కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో భూమిలోకి పుష్కలంగా నీరు చేరి భూగర్భజలాలు ౖపైపెనే ఉన్నాయని అంటున్నారు.
యాసంగి సాగు 3.17 లక్షల ఎకరాలు
జిల్లావ్యాప్తంగా యాసంగిలో 3.17 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. గతేడాది యాసంగిలో 2.96 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ ఏడాది మరో 21 వేల ఎకరాలు అదనంగా సాగవుతోంది. ఇందుకు భూగర్భజలాల పెంపే ప్రధాన కారణమని తెలిసింది. కాగా సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల నేపథ్యంలో దానిపై ఆధారపడిన ఘనపూర్ ప్రాజెక్టుకు సైతం నీటి తడులు వచ్చే అవకాశం లేదు. ఆ ప్రాజెక్టు పరిధిలోని 21 వేల ఎకరాల ఆయకట్టు తగ్గే అవకాశం ఉంది. దీంతో అధికారులు వేసిన సాధారణ సాగు అంచనాలో కొంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా జిల్లాలో ఎప్పటిలాగే రైతులు వరిసాగుకు మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ యాసంగిలో అధికారిక లెక్కల ప్రకారం 3.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా, అందులో సింహభాగం 2.95 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. మిగితా 22 వేల ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, కూరగాయలు ఇతర పంటలు సాగు కానున్నాయి.


