బల్దియాలకు నిధులు
ఏడాదిలో మెదక్‌కురూ. 160 కోట్ల మేర మంజూరు నాలుగు మున్సిపాలిటీల్లోముమ్మరంగా అభివృద్ధి పనులు
తూప్రాన్ మినహా..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేసింది. మెదక్ మున్సిపాలిటీకి ఏడాది కాలంలో ఏకంగా రూ. 160 కోట్లు ఇచ్చింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కేటాయించినట్లుతెలిసింది. – రామాయంపేట(మెదక్)
టీయూఎఫ్‌ఐడీసీ పథకం కింద జిల్లాలోని తూప్రాన్ మినహాయించి, మిగితా మున్సిపాలిటీలకు నిధులు మంజూరయ్యాయి. మూడు మున్సిపాలిటీలకు రూ. 92.5 కోట్లు కేటాయించారు. గజ్వేల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న తూప్రాన్ మున్సిపాలిటీకి టీయూఎఫ్‌ఐడీసీ కింద నయా పైసా మంజూరు కాలేదనే ఆరోపణలున్నాయి. ఇతర శాఖల నుంచి కూడా తూప్రాన్‌కు నామమాత్రంగానే నిధులు మంజూరైనట్లు బీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు.
మెదక్ పట్టణంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, దుకాణ సముదాయం, అమృత్ పథకం కింద వాటర్ ట్యాంకులు, మూత్రశాలల నిర్మాణం, ట్రీ ప్లాంటేషన్ తదితర పనులకు పెద్దఎత్తున నిధులు మంజూరయ్యాయి. తెలంగాణ అర్బన్ మౌలిక వసతులు, యూఎఫ్‌ఐడీసీ, అమృత్ పథకం, హడ్కో తదితర శాఖల నుంచి నిధులు కేటాయించారు. వీటిని మున్సిపాలిటీల పరిధిలో సిమెంటు రోడ్లు, మురుగు కాలువలు, తారు రోడ్లు, పార్కుల అభివృద్ధి, ఇతరత్ర పనులకు కేటాయించనున్నారు. ఇటీవల మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సీఎం రేవంత్‌రెడ్డి కలిసి నిధుల కోసం విన్నవించగా, ప్రత్యేకంగా మెదక్ మున్సిపాలిటీకి రూ. 85 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం నాలు గు మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పార్టీకి లబ్ధి చేకూరుతుందని, తద్వారా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు దోహదపడుతుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో రూ. 25 కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, ఇతరత్ర పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నట్లు సమాచారం.
ఎన్నికల నేపథ్యంలో కేటాయింపు


