‘పది’ విద్యార్థులకు అల్పాహారం
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ఉపశమనం లభించింది. ఫిబ్రవరి 16 నుంచి అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక తరగతులు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహారం అందించ లేకపోయింది. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు కేవలం 19 రోజులు మాత్రమే అల్పాహారం అందించాలని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని పదో తరగతి విద్యార్థులు 9,640 మందికి లబ్ధి చేకూరనుంది. ఈసారి అక్టోబర్ 7 నుంచే టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ ప్రారంభించింది. ఇంతవరకు బాగానే ఉన్నా దూర ప్రాంతాల నుంచి ఉదయం వచ్చే విద్యార్థు లు ఆకలితో ప్రత్యేక తరగతులకు హాజరవుతూ ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో అధ్యాపకులు స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో అరకొరగా స్నాక్స్ సదుపాయాలు కల్పించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 15 చొప్పున రూ. 285 అందించనుంది. ఉడకబెట్టిన పెసలు, బొబ్బర్లు లేదా శనగలు, పల్లీలు, బెల్లం వంటి పోషకాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లిపాయ పకోడి వంటివి రోజుకు ఒక్కోరకం చొప్పున విద్యార్థులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
వచ్చే నెల 16 నుంచి ప్రారంభం
ప్రత్యేక తరగతుల్లో అందజేత
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం


