పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికలు
కలెక్టర్ రాహుల్‌రాజ్
రామాయంపేట(మెదక్): మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్‌రూంను పరిశీలించి మాట్లా డారు. ఎన్నికల సంఘం ఆదేశాలను విధిగా పాటించాలని, బ్యాలెట్ పేపర్ల భద్రతకు మూడంచెల భద్రత వ్యవస్థతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ హాల్‌లో టేబుళ్లు, కంట్రోల్ రూం ఏర్పాటు విషయమై దృష్టి సారించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చో టు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని సందర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని, అధిక డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అక్కన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ రజని, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మేనేజర్ రఘువరన్, వ్యవసాయ విస్తరణ అధికారి రాజ్‌నారాయణ ఉన్నారు.


