ఆటలకు టాటా..
నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు
తూప్రాన్: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పా టు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. ఆటలకు అనువుగా లేని చోట, చెరువులు, శిఖం భూములు, అడవులు, వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో క్రీడా మైదానానికి ఎకరం నుంచి మూడెకరాల వరకు కేటాయించారు. అక్కడ పరిస్థితులను బట్టి ఒక్కో మైదానానికి రూ. 1.65 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఖర్చు చేసేలా అనుమతించారు. అయితే క్రీడా ప్రాంగణాలకు కేవలం బోర్డులు ఏర్పాటు చేసి వదిలేశారు. కొన్నిచోట్ల వాలీబాల్, కోకో ఆటలకు అవసరమైన స్తంభాలు ఏర్పాటు చేశారు. మండలంలోని వెంకటాయపల్లి సమీపంలోని చెరువులో, కిష్టాపూర్‌లోని వ్యవసాయ పొలాల్లో క్రీడా మై దానాలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా తూప్రాన్ పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటుకు గతంలో పట్టణ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల పక్కన ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని అధికారులు గుర్తించారు. ఇందుకోసం నిధులు సైతం కేటాయించినట్లు చెప్పారు. అయితే ఇప్పటివరకు క్రీడా మైదానం ఊసే ఎత్తకపోవటంపై క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


