అవగాహనతోనే సైబర్ నేరాలకు చెక్
మెదక్ మున్సిపాలిటీ: సైబర్ నేరాలను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ‘మహిళల రక్షణ– పిల్లల సంరక్షణ’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం పెరగడంతో సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని నమ్మకం పొంది, అనంతరం మోసాలకు పాల్పడుతున్న ఘటనలు అధికంగా జరుగుతున్నాయని వివరించారు. అపరిచితులను నమ్మవద్దని సూచించారు. అనంతరం విద్యార్థులతో సైబర్ నేరాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. క్విజ్ పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ సు భాశ్ చంద్రబోస్, కళాశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి, అధ్యాపకులు, సైబర్ క్రైం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
అదనపు ఎస్పీ మహేందర్


