నా ఓటు ఎటు..?
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026
ఓటరు జాబితా తప్పుల తడక
నాలుగు మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి ● ముసాయిదాపై అభ్యంతరాల వెల్లువ
మెదక్ పట్టణంలోని ఆజంపుర వార్డుకు చెందిన పిల్లి ఆంజనేయులు, ఉమాదేవీ భార్యాభర్తలు. ఇరవై ఏళ్లుగా ఓటు వేస్తున్నారు. ఇటీవల మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేయగా.. అందులో ఈ దంపతుల పేర్లు లేవు. ఆన్‌లైన్ ద్వారా పరిశీలిస్తే ఫ్రీజింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. ఈ సమస్య ఒక్క ఆంజనేయులు దంపతులదే కాదు.. వందలాది మంది ఓటర్ల పరిస్థితి. కొన్ని మున్సిపాలిటీల్లో అయితే.. చనిపోయిన వారి ఓట్లు తొలగించకుండా జాబితాలో ప్రదర్శించడం, ఒకే కుటుంబానికి చెందిన వారి ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండటం, గ్రామ ప్రజల ఓట్లు మున్సిపాలిటీల్లో ఉండడంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.
మెదక్‌జోన్: జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటి పరిధిలో 75 వార్డులు ఉండగా.. సుమారు 86 వేల మంది ఓటర్లు ఉన్నారు. 2025 అక్టోబర్ ఒకటిన ఫైనల్ చేసిన ఓటరు జాబితాను ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు విడుదల చేశారు. బల్దియా ఓటర్లను విభజించి వార్డుల వారీగా జాబితాను ప్రదర్శించారు. అయితే.. వాటిలో అనేక తప్పులు దొర్లాయి. సోమవారం అన్ని మున్సిపాలిటీలలో కమిషనర్లు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేయగా, ఓటరు జాబితాలో దొర్లిన తప్పులను వెంటనే సరిచేశాకనే ఎన్నికలను నిర్వహించాలని ఆయా పార్టీల నేతలు డిమాండ్ చేశారు. తూప్రాన్ పరిధిలో ఆయా గ్రామాలకు చెందిన ఓటర్లను మున్సిపాలిటీలో చేర్చటంతో అంతా విస్మయం చెందుతున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న వారి పేర్లు మున్సిపాలిటీల్లో దర్శనమిస్తున్నాయి. తూప్రాన్‌లో గతంలో 17 వేల పైచిలుకు ఓటర్లు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం 19 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన అదనంగా 2 వేల ఓట్లు ఎక్కువగా నమోదు అయ్యాయి. వీటిని వెంటనే సరిచేయాలని పార్టీలకు అతీతంగా నేతలు డిమాండ్ చేస్తున్నారు. నర్సాపూర్‌లోని పలు వార్డుల్లో సైతం ఆయా గ్రామాలకు చెందిన వారి ఓటర్లు బల్దియాల్లో ఉన్నాయి. రామాయంపేటలో చనిపోయిన వారి పేర్లు తొలగించలేదు. మెదక్‌లోనూ ఒక కుటుంబానికి చెందిన వారి ఓట్లు ఒకే వార్డులో ఉండాల్సి ఉండగా వివిధ వార్డుల్లో ఉండటం, మరి కొంత మంది ఓట్లు ఫ్రీజింగ్‌లో పెట్టడంతో అంతా గందరగోళంగా ఉంది.
10న తుది జాబితా విడుదల చేస్తాం
కుటుంబ సభ్యుల పేర్లన్నీ ఒకే వార్డులోకి వచ్చే విధంగా జాబితాను సరి చేసి ఈనెల 10న తుది జాబితాను విడుదల చేస్తాం. ప్రస్తుత జాబితాలో ఎవరైనా చనిపోయిన వారి పేరుంటే వాటిని తొలగించటం కుదరదు, అలాగే కొత్తవారిని చేర్చటం సాధ్యంకాదు. ప్రస్తుతం విడుదలైన జాబితాలో 2025 నవంబర్ ఒకటిన తాజాగా తయారు చేసింది.
– బల్దియాల ప్రత్యేక అధికారి, నగేష్
నా ఓటు ఎటు..?
నా ఓటు ఎటు..?
నా ఓటు ఎటు..?


