మైనార్టీలకు సహారా
మెదక్ కలెక్టరేట్: గత ఏడాది సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఆగిపోయిన ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంతన్నకా సహారా పథకాలు ప్రభుత్వం తిరిగి తెరపైకి తీసుకొచ్చింది. నిరుపేద ముస్లిం మైనార్టీ ప్రజల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 19న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఈ పథకాలను ప్రారంభించారు. సర్పంచ్ ఎన్నికలు రావడంతో పథకాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో తిరిగి వాటిని అమలు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన
జిల్లాలోని ఆర్థికంగా వెనకబడిన నిరుపేదలైన మైనార్టీ (ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ వర్గాలకు చెందిన) మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ పథకం ద్వారా రూ.50వేల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. ముఖ్యంగా ఫకీర్, దూదెకుల, వితంతువులు, ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వీరంతా వ్యాపారం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చేయూత అందిస్తారు. రుణం పొందిన మహిళలు చిన్నపాటి వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు.
వంద శాతం సబ్సిడీ
రాష్ట్రంలోని నిరుపేద ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ముస్లిం మైనార్టీ వర్గాల్లోని నిరుపేదలైన ఫకీర్, దూదెకుల, ఇతర అట్టడుగు వర్గాల ప్రజల ఆర్థికాభివృద్ధికి మోపెడ్‌లు, బైక్‌లు, ఈ–బైక్‌లు వందశాతం సబ్సిడీపై అందించనున్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.1లక్ష వరకు గ్రాంట్ మంజూరు చేయనున్నారు. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
ఈనెల 10 వరకు గడువు
మొత్తం రూ.30 కోట్లతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలను ప్రవేశ పెట్టింది. జిల్లాలోని అర్హులైన ముస్లిం మైనార్టీలు ఈనెల 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించడం ఉండదు.
ఎవరు అర్హులు
రెండు పథకాలకు శ్రీకారం
సబ్సిడీ రుణాలు, ఉచిత వాహనాలు
ఈనెల 10 వరకు దరఖాస్తుల స్వీకరణ
మైనార్టీ వర్గాలకు చెంది తెలంగాణలో స్థిర నివాసులై ఉండాలి. కనీసం పదో తరగతి చదివి 21 నుంచి 55 యేళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగి ఉండాలి. ఐదేళ్లలో మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి ఎలాంటి సాయం పొందలేదని డిక్లరేషన్ ఇవ్వాలి. కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఒక పథకం అందించనున్నారు.


