రసవత్తరం.. ఆసక్తికరం
ఆద్యంతం ఆకట్టుకున్న ‘యూత్ పార్లమెంట్’
● వాడీవేడి చర్చలు.. వాదోపవాదాలు
● పోటీపడిన సభ్యులతో అట్టుడికిన సభ
● మోడల్ పార్లమెంట్ సెషన్ అబ్బురం
● కొల్లాం, వల్సాడ్ విద్యార్థుల విశేష ప్రతిభ
వర్గల్(గజ్వేల్): వాడీవేడి చర్చ.. అధికార ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలు.. సమస్యలు లేవనెత్తిన ప్రతిపక్ష సభ్యులు.. ప్రధాని, మంత్రుల సమాధానాలు.. సంతృప్తి చెందని సభ్యుల నిరసనలు.. సభ వాయిదా.. ఇలా.. మంగళవారం వర్గల్ నవోదయ వేదికగా జాతీయ స్థాయి ‘యూత్ పార్లమెంట్’ ఆద్యంతం రసవత్తరంగా.. ఆసక్తికరంగా సాగింది.
యూత్ పార్లమెంట్ పోటీలలో భాగంగా కేరళ రాష్ట్రంలోని కొల్లాం, గుజరాత్ రాష్ట్రం వల్సాడ్ నవోదయ విద్యార్థులు 55 మంది చొప్పున వేర్వేరుగా గంట పాటు వాడీవేడి ప్రసంగాలతో అదరగొట్టారు. పార్లమెంటేరియన్ల మాదిరి చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. స్పీకర్, ప్రధానమంత్రి, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంట్ సభ్యులుగా పాత్రలు పోషిస్తూ 55 మంది సభ్యులతో కూడిన ఒక్కో విద్యాలయ జట్టు సభను కొనసాగించారు.
వల్సాడ్ విద్యార్థులు ఇలా..
మొదట వల్సాడ్ నవోదయ బృందం సెషన్ జరిగింది. దాదాపు గంటపాటు కొనసాగిన ఈ సభలో యూత్ పార్లమెంటేరియన్లుగా విద్యా విధానంపై, రైల్వే దుర్ఘటనలపై, లోక్‌సభ, అసెంబ్లీకి జరిగే జమిలి ఎన్నికలపై క్వశ్చన్ అవర్‌లో ప్రస్తావించారు. జీరో అవర్‌లో పర్యావరణ సమస్య, నీటి కాలుష్యంపై సభ్యులు చర్చించారు. విద్యా బిల్లుపై సమగ్ర చర్చ జరిపారు. అనంతరం బిల్లును సభలో ఆమోదింపజేశారు. సభ వాయిదా వేసి ప్రదర్శన ముగించారు.
కొల్లాం విద్యార్థుల ప్రదర్శన..
కొల్లాం నవోదయ విద్యార్థుల యూత్‌పార్లమెంట్ సెషన్‌లో ఇటీవల మరణించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్‌పై సంతాప తీర్మానం ప్రవేశపెట్టింది. క్వశ్చన్ అవర్‌లో ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్ష విధానం, భారత విదేశాంగ విధానం, రైతుల సమస్యపై ప్రశ్నలతో ప్రస్తావించారు. జీరోఅవర్‌లో విదేశాల్లో భారతీ య విద్యార్థుల వెతలను సభ్యులు ప్రస్తావించారు. మహిళ రిజర్వేషన్ బిల్లుపై చర్చ అనంతరం సభలో ఆమోదింపజేశారు. రెండు జట్ల నుంచి ఉత్తమ ప్రతిభ చాటిన 16 మందిని పురస్కారానికి ఎంపిక చేశారు.


