నేటి నుంచి పీఎంశ్రీ క్రీడలు
మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలో మంగళవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు పీఎంశ్రీ క్రీడలు నిర్వహించనున్నట్లు డీఈఓ విజయ తెలిపారు. సోమవారం పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. క్రీడలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. పోటీల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, కేజీబీవీ, తెలంగాణ మోడల్ స్కూళ్ల నుంచి సుమారు 92 మంది వ్యాయామ ఉపాధ్యాయులను నియమించినట్లు చెప్పారు. జిల్లాలోని మొత్తం 29 పీఎం శ్రీ పాఠశాలల నుంచి ప్రతిరోజూ సుమారు 520 మంది బాల బాలికలు పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. పోటీలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. క్రీడాకారులకు భోజన వసతి కల్పించడంతో పాటు, గెలుపొందిన విజేతలకు బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పీడీలు నాగరాజు, ప్రతాప్‌సింగ్, మాధవరెడ్డి, దాసరి మధు, రవి, అశోక్, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
డీఈఓ విజయ


