సత్వరమే పరిష్కరించాలి
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. డీఆర్‌ఓ భుజంగరావు, డీఆర్డీఓ శ్రీనివాస్, జెడ్పీసీఓ ఎల్లయ్యతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈమేరకు భూ సంబంధిత సమస్యలపై 32, పెన్షన్ 10, ఇందిరమ్మ ఇళ్లు 2, ఇతర సమస్యలు 18 కలిపి మొత్తం 64 వినతులు వచ్చాయి. కాగా గతంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్‌రాజ్ పాల్గొని అర్జీలు స్వీకరించేవారు. దీంతో జిల్లాస్థాయి అధికారులంతా పాల్గొనేవారు. సోమవారం రేగోడ్ మండల కేంద్రంలో జరిగిన ప్రజావాణికి కలెక్టర్ హాజరయ్యారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు కనిపించక పోవడం గమనార్హం.
రోడ్డు నిబంధనలు తప్పనిసరి
మెదక్‌జోన్: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు తప్పనిసరి ధరించాలని, అలాగే కార్లు నడిపే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని ఎంవీఐ విజయలక్ష్మి సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం పట్టణంలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభు త్వం ప్రవేశపెట్టే నిబంధనలు వాహనదారుల రక్షణ కోసమనే విషయాలు ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖా పరమైన చర్యలు తప్పవని హె చ్చరించారు. కార్యక్రమంలో ఇతర అధికారులు శ్రీలేఖ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
యాసంగికి సరిపడా యూరియా: ఏడీఏ
కౌడిపల్లి(నర్సాపూర్): యాసంగికి సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు అందోళన చెందవద్దని ఏడీఏ పుణ్యవతి అన్నారు. సోమవారం మండలంలోని మహమ్మద్‌నగర్ గేట్ వద్ద గల పీఏసీఎస్, కౌడిపల్లిలోని డీసీఎంఎస్ ఎరువుల దుకాణంలో యూరియా స్టాక్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాసంగి పంటల అంచనా మేరకు ప్రభుత్వం యూరియా సరఫరా చేస్తుందన్నారు. రైతులు అనవసరంగా ఆందోళన చెందుతూ ముందుగానే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈ–పాస్ మిషన్ ద్వారా యూరియా విక్రయించాలని డీలర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఓ స్వప్న, పీఏసీఎస్ సీఈఓ దుర్గాగౌడ్, రైతులు పాల్గొన్నారు.
సమయపాలన పాటించాలి
డీఎంహెచ్‌ఓ శ్రీరాం
నర్సాపూర్: పీహెచ్‌సీలలో పని చేసే వైద్యులతో పాటు ఇతర సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌ఓ శ్రీరాం ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఏరియా ఆస్పత్రిలో నర్సాపూర్ వైద్యశాఖ సబ్ డివిజన్ పరిధిలోని రెడ్డిపల్లి, కౌడిపల్లి, శివ్వంపేట, రంగంపేట, కొల్చారం పీహెచ్‌సీల వైద్యులు, ఇతర సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అందరూ సమయపాలన పాటిస్తూ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. చలికాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సృజన, డీఐఓ డాక్టర్ మాధురి, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్లు రఘువరన్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీపీ కార్యాలయం సందర్శన
రామాయంపేట(మెదక్): మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎంపీపీ కార్యాలయంలో స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. ఈమేరకు ఆయన మున్సిపల్ కమిషనర్ దేవేందర్, తహసీల్దార్ రజనితో కలిసి ఎంపీపీ కార్యాలయాన్ని సందర్శించారు. కౌంటింగ్‌కు సంబంధించి నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఆయన వెంట టౌన్ ప్లానింగ్ అధికారి దేవరాజు, మున్సిపల్ మేనేజర్ రఘువరన్ ఇతర అధికారులు ఉన్నారు.
సత్వరమే పరిష్కరించాలి


