గ్రామాల్లో ఐదేళ్లు పనిచేయాలి
● ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ● అసెంబ్లీలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సర్వీసులో ఐదారేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా నిబంధనలు విధించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ...పిల్లల చదువుల కోసం పట్టణాలు, నగరాల్లో, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతుండటం, గ్రామీణప్రాంతాల్లో పనిచేస్తున్నా డిప్యూటేషన్‌పై వెళ్తుండటంతో గ్రామీణప్రాంతాల్లో ఇబ్బందులు తప్పడంలేదన్నారు. విశ్వవిద్యాలయాలు పట్టణ ప్రాంతానికే పరిమితమవుతున్నాయన్నారు. ఖేడ్ నియోజకవర్గంలో ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల శాఖలను ఏర్పాటు చేయాలని కోరారు. నిజాంసాగర్ సమీపంలోని ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్‌ను పునరుద్ధరిస్తే ఖేడ్, జుక్కల్ నియోజకవర్గాలకు మేలు చేకూరుతుందని వివరించారు.
హాస్టల్ బెడ్స్ అమ్మకం
సిర్గాపూర్ ఎస్సీ హాస్టల్‌కు సరఫరా అయిన బెడ్స్, మంచాలను అమ్ముకున్నట్లు సంజీవరెడ్డి అసెంబ్లీలో సభ దృష్టికి తీసుకొవచ్చారు. ఈ హాస్టల్ వార్డెన్ 8 ఏళ్లుగా లాంగ్‌స్టాండింగ్‌గా ఉండటం, పిల్లలకు సక్రమంగా భోజనం పెట్టడంలేదని పిల్లలు చెప్పారన్నారు.


