ఇళ్లు నిర్మించకుంటే రద్దు చేస్తాం
హౌసింగ్ పీడీ మాణిక్యం
కౌడిపల్లి(నర్సాపూర్): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే రద్దు చేస్తామని జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. సోమవారం కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించి మాట్లాడారు. జిల్లాకు 9,209 ఇళ్లు మంజూరు కాగా, 57 పూర్తయ్యాయని తెలిపారు. 2,109 ఇళ్లు బేస్‌మెంట్ లెవల్, 1,042 రూప్ లెవల్, 1,432 స్లాబ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా 2,922 మంది పనులు ప్రారంభించలేదన్నారు. జి ల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు ఇళ్లు ప్రారంభించని వారు లిస్టు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. రద్దు అయిన వాటి స్థానంలో అర్హులైన కొత్తవారికి మంజూరు చేస్తామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో రూ. 90 కోట్లకు పైగా ఇందిరమ్మ ఇళ్లకు వివిధ దశలలో బిల్లులు చెల్లించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఏఈలు సుష్మ, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.


