కాంగ్రెస్‌లో కుమ్ములాటలు
చిచ్చురేపిన సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడి ఎంపిక
● హన్మంతరావు వర్సెస్ రాజిరెడ్డి
● పోటాపోటీగా నియామకాలు
కాంగ్రెస్ పార్టీలో చాపకింద నీరులా ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడి ఎంపిక విషయం మైనంపల్లి హన్మంతరావు, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి మధ్య చిచ్చురేపింది. ఇరువురు చెరో వ్యక్తికి మద్దతు పలకగా, చివరకు రాజిరెడ్డి మద్దతుదారుడు కల్యాణ్‌కు రాష్ట ఫోరం అధ్యక్షుడు ఆశాదీప్ నియామకపత్రం అందజేశారు.
– మెదక్‌జోన్
జిల్లాలో గత నెలలో పంచాయతీ ఎన్నికలు జరగగా, ఆయా మండలాల పరిధిలో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుల నియామకాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి అవుల రాజిరెడ్డి మధ్య విభేదాలు తలె త్తాయి. మైనంపల్లి తన అనుచరుడు చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన ఆవుల గోపాల్‌రెడ్డిని ఎంపిక చేసేందుకు సర్వం సిద్ధం చేశాడు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సమావేశం ఏర్పాటు చేసి గోపాల్‌రెడ్డి పేరును ప్రకటించాలని నిర్ణయించాడు. ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారని తెలిసింది. ఈ క్రమంలోనే ఆవుల రాజిరెడ్డి ఆదివారం జిల్లాలోని సుమారు 15 మందికి పైగా సర్పంచ్‌లతో మాసాయిపేట మండలం హకింపేటలోని ఓ రిసార్టులో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యాయి. జిల్లావ్యాప్తంగా 21 మండలాలు ఉండగా, 15 మండలాల ఫోరం అధ్యక్షుల మద్దతు కూడగట్టి ఫోరం రాష్ట్ర అధ్యక్షుడి చేతుల మీదుగా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి (పీటీ) సర్పంచ్ మన్నె కల్యాణ్‌కు సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా అధికారంగా నియామకపత్రం అందించారు.
పంతం నెగ్గించుకున్న రాజిరెడ్డి
అక్టోబర్‌లో జరిగిన డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కోసం ఏఐసీసీ నుంచి జ్యోతిరౌతేలా, పీసీసీ నుంచి ఎన్నికల పరిశీలకులు జగదీశ్వరరావు, నాసిక్ మహ్మద్, వరలక్ష్మి మెదక్ వచ్చారు. కాగా అధ్యక్ష పీఠం కోసం ఆవుల రాజిరెడ్డి, అదే నియోజకవర్గానికి చెందిన అంజనేయులుగౌడ్, రాంచందర్‌గౌడ్ పోటీపడగా రాజిరెడ్డి, అంజనేయులుగౌడ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా అంజనేయులుగౌడ్ అప్పటికే డీసీసీగా కొనసాగాడని, ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని రాజిరెడ్డి గట్టిగా పట్టుబట్టినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో మైనంపల్లి హన్మంతరావుకు సన్నిహితంగా ఉండే అంజనేయులుగౌడ్‌కే రెండోసారి డీసీసీ పీఠం దక్కింది. దీంతో రాజిరెడ్డి, హన్మంతరావుల మధ్య దూరం పెరిగింది. అప్పటి నుంచి రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ నేపథ్యంలోనే జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా తన వర్గానికి చెందిన కల్యాణ్‌ను ఎంపిక చేసి రాజిరెడ్డి తన పంతం నెగ్గించుకున్నారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.


