ఆపరేషన్ స్మైల్–12 పోస్టర్ల ఆవిష్కరణ
జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతోపాటు తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిల్లలను రక్షించే లక్ష్యంతో ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇందులోభాగంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అవగాహన పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి యజమానులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు లేదా సహాయం అవసరమైన పిల్లలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 1098కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి, డీసీఆర్బి ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి, ఆర్‌ఎస్సై నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీస్
కార్యాలయంలో పరేడ్
పర్యవేక్షించిన అదనపు ఎస్పీ మహేందర్
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో శనివారం పోలీస్ పరేడ్ నిర్వహించారు. కాగా, ఈ పరేడ్‌ను అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్‌ను పరిశీలించి, అధికారులు, సిబ్బందికి విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం ఎంతో అవసరమని సూచించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అనంతరం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి, నిర్ణీత వేగ పరిమితుల్లో వాహనాలు నడుపుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్నకుమార్, రంగా నాయక్, సీఐలు మహేష్, కృష్ణమూర్తి, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
పద్యాలను భవిష్యత్
తరాలకు అందించాలి
పద్యాల పోటీలు నిర్వహిస్తున్న రిటైర్డ్ టీచర్
పాపన్నపేట(మెదక్): పద్యాలను తర్వాత తరాలకు అందించి తెలుగు భాషను కాపాడుకోవాలని రిటైర్డ్ టీచర్ సాంబశివరావు అన్నారు. శనివారం ఆయన మండల పరిధిలోని ఎల్లాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పద్యాల పోటీని నిర్వహించారు. తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమంలో భాగంగా మాచవరంకు చెందిన ఈయన విద్యార్థుల చేత పద్యాలు చదివించారు. పద్యానికి రూ.10 ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. కార్యక్రమంలో అత్యధికంగా 4వ తరగతి విద్యార్థిని గొల్ల అక్షిత 62 పద్యాలు, ఏడో తరగతి విద్యార్థిని ఏముడాల సహస్ర 60 పద్యాలను చెప్పారు. జిల్లాలోని పాఠశాలల్లో తిరుగుతూ పద్యాల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మైనార్టీల సంక్షేమానికి కృషి
ఎంపీ సురేశ్ షెట్కార్
నారాయణఖేడ్: మైనార్టీల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని జహీరాబాదు ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. ఖేడ్ ఎడ్లబజార్‌లోని ఖాజాబందేనవాజ్ దర్గాకు ప్రహారీకోసం తనకోటా నుంచి రూ.5 లక్షలను మంజూరు చేసి శనివారం పనులకు శంకుస్థాపన చేశారు. మైనార్టీ సంక్షేమ సంఘం బాధ్యులు తాహెర్‌అలీ, మొయినుద్దీన్, మజీద్, రషీద్, అయూష్, వహీద్, మొయిజ్ తదితరులు ఎంపీని శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఆపరేషన్ స్మైల్–12 పోస్టర్ల ఆవిష్కరణ
ఆపరేషన్ స్మైల్–12 పోస్టర్ల ఆవిష్కరణ


