హాల్‌టికెట్‌ చెకిట్‌! | - | Sakshi
Sakshi News home page

హాల్‌టికెట్‌ చెకిట్‌!

Jan 4 2026 11:01 AM | Updated on Jan 4 2026 11:01 AM

హాల్‌టికెట్‌ చెకిట్‌!

హాల్‌టికెట్‌ చెకిట్‌!

ఈసారి పేరెంట్స్‌ నంబర్లకు ఇంటర్‌ హాల్‌ టికెట్‌ ఈ ఏడాది ప్రవేశ పెట్టిన ఇంటర్‌బోర్డు వివరాల్లో తప్పులు దొర్లితే ముందస్తుగా సరిచేసుకునే అవకాశం

నారాయణఖేడ్‌: పరీక్షా సమయాల్లో విద్యార్థులు ఆందోళనలకు గురికాకుండా ఇంటర్‌ విద్యార్థులకు ఇంటర్మీడియెట్‌ బోర్డు ముందస్తు చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలతోపాటు ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్ల ప్రివ్యూను ఇంటర్‌ బోర్డు విద్యార్థులకు తల్లిదండ్రుల మొబైల్‌ నంబర్లకు పంపించనుంది. విద్యార్థుల తల్లిదండ్రుల రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్లలో వాట్సాప్‌ ఉన్న నంబర్లకు వారి పిల్లలకు సంబంధించిన హాల్‌టికెట్ల ప్రివ్యూను పంపించనున్నారు. ఈ ప్రివ్యూను శనివారం నుంచే అమలులోకి తీసుకువచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిన హాల్‌ టికెట్స్‌ ప్రివ్యూలో విద్యార్థికి సంబంధించిన వివరాలను చెక్‌ చేసుకోవచ్చు. వివరాల్లో ఏమైనా తప్పులు దొర్లితే వెంటనే సంబంధిత ప్రిన్సిపాల్‌ను సంప్రదించి సరిచేసుకునే సదుపాయాన్ని కల్పించారు. మొదటి సంవత్సరం విద్యార్థుల హాల్‌టికెట్స్‌ ప్రివ్యూ రావాలంటే ఆ విద్యార్థి ఎస్‌ఎస్‌సీ రోల్‌ నంబరు, పుట్టిన తేదీని ఎంటర్‌ చేయడం ద్వారా హాల్‌టికెట్‌ ప్రివ్యూను చూసుకోవచ్చు. అలాగే రెండో సంవత్సరం విద్యార్థులకు సంబంధించి ఆ విద్యార్థి మొదటి సంవత్సరం హాల్‌టికెట్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేస్తే రెండో సంవత్సరం హాల్‌టికెట్‌ ప్రివ్యూ చూసుకోవచ్చు. రెండో సంవత్సరం విద్యార్థులకు సంబంధించి ఆ విద్యార్థి మొదటి సంవత్సరంలో పాసైన సబ్జెక్టులు, ఫెయిల్‌ అయిన సబ్జెక్టులతోపాటు ఆయా పరీక్షల టైం టేబుల్‌ వివరాలు ఉండనున్నాయి. చాలామంది విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉండటంతో హాల్‌టికెట్లను సకాలంలో పొందడం, లోపాలను ముందుగానే గుర్తించడం, విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలలు, జిల్లా అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగు పర్చడం కోసం ఈ వాట్సాప్‌ ఆధారిత కమ్యూనికేషన్‌ వ్యవస్థను ఇంటర్‌ బోర్డు ప్రవేశపెట్టింది.

విద్యార్థులకు ఉపయుక్తం

పరీక్షల సమయంలో హాల్‌టికెట్లు జారీ కావడంతో దొర్లిన తప్పులను సరిచేసుకోలేకపోవడం, కేంద్రం, పేరు ఇతర వివరాలు తప్పులుగా రావడంతో చాలామంది విద్యార్థులు గతంలో ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు ఈసారి తీరనున్నాయి. ఈ విధానం ద్వారా జిల్లాలో ఇంటర్‌ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మేలు చేకూరనుంది.

వచ్చేనెల 2 నుంచి ప్రాక్టికల్స్‌

జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 20, ప్రభుత్వ సెక్టార్‌లో 70, ప్రైవేట్‌ కళాశాలలు 47 కొనసాగుతున్నాయి. వీటిల్లో మొదటి సంవత్సరంలో 18,249మంది విద్యార్థులు, సెకండ్‌ ఇంటర్‌ 17,983 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరూ ఫిబ్రవరిలో జరగనున్న పరీక్షలకు సంసిద్ధులవుతున్నారు. కాగా, ఈ నెల 21న ఇంటర్‌ మొదటి సంవత్సరం ఇంగ్లిష్‌ ప్రాక్టికల్‌ పరీక్ష, 22న రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్‌ పరీక్ష ఉండనుంది. ఫిబ్రవరి 2 నుంచి 21వరకు ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement