బకాయిలివ్వండి సారూ!
ప్రభుత్వం మారగానే
అర్ధాంతరంగా ఆగిన పనులు
కాంట్రాక్టర్లకు రూ.11.19 కోట్ల బకాయిలు!
ఆందోళన చెందుతున్న బాధితులు
‘మన ఊరు మన బడి’పనులు చేసి రెండేళ్లు
మెదక్‌జోన్: ప్రభుత్వం మారిన ప్రతిసారీ పథకాల పేరుమార్చి కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ వారికి అనుకూలమైన పేర్లు పెట్టుకోవటం సహజమే. అయితే గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను అర్ధాంతరంగా నిలిపివేయటంతోపాటు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులను నిలిపివేయటంతో ‘మన ఊరు మన బడి’పథకంలో పనులు చేసి రెండేళ్లుగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు.
మెదక్ జిల్లాలో 2021–2022లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్కారు పాఠశాలల అభివృద్ధికి ‘మన ఊరు మన బడి’పథకంలో భాగంగా 313 పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. వీటి కోసం ఆయాశాఖల ఇంజనీర్లు వాటి మరమ్మతులకు రూ.74.99 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. వీటిలో రూ.30 లక్షలకుపైగా నిధులు మంజూరైన పాఠశాలలను టెండర్ ద్వారా పనులు చేపట్టగా అంతకు తక్కువగా మంజూరైన స్కూళ్లకు నేరుగా అదే పాఠశాలకు చెందిన చైర్మన్లకు లేదా, గ్రామస్తులకు పనులు అప్పగించారు. వీటిలో రూ.10 లక్షల లోపు నిధులు మంజూరైన పాఠశాలల పనులు చాలావరకు పూర్తి కాగా అంతకు మించి నిధులు మంజూరైన పాఠశాలల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో 2023 డిసెంబర్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాగా, ఆ ప్రభుత్వంలో ఆగిన పనులను పూర్తి చేయకుండా అర్ధాంతరంగా వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘మన ఊరు మన బడి’పథకం పేరు మార్చి ‘అమ్మ ఆదర్శ పథకం’పేరుతో 500 పైచిలుకు పాఠశాలలను అభివృద్ధి చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, గత ప్రభుత్వం చేసిన పనులు అర్ధాంతరంగా వదిలేయటంతో సదరు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.


