వీబీజీరాంజీతో 125 రోజుల పనులు
కేవీకే సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్
కౌడిపల్లి(నర్సాపూర్): వీబీజీరాంజీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ)2025తో గ్రామాలలో ఉపాధిహామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం 125రోజులు పనిదినాలు కల్పించినట్లు కేవీకే సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్ తెలిపారు. మండలంలోని తునికి కేవీకేలో వీబీజీరాంజీపై కౌడిపల్లి, నర్సాపూర్ మండల పంచాయతీ కార్యదర్శులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని చట్టసవరణ చేసి 100రోజుల పనిదినాలను 125రోజులకు పెంచిందన్నారు. గ్రామసభల్లో ఎంపిక చేసిన పనులను మాత్రమే చేయాలని చెప్పారు. అనంతరం నర్సాపూర్ ఏపీఓ అంజిరెడ్డి మట్లాడుతూ.. కొత్తచట్టం ద్వారా గ్రామాలలో జలసంరక్షణ, మౌలిక సదుపాయాలు, జీవనోపాదులు, తీవ్ర వాతవరణ సంఘటనలకు సంబంధించిన పనులు చేపట్టవచ్చన్నారు. గ్రామస్థాయిలోనే సామాజిక తనిఖీలు నిర్వహించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు శ్రీకాంత్, శ్రీనివాస్, రవికుమార్, ఉదయ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


