రాయితీ ఇచ్చినారు
తగ్గిన కూరగాయల సాగు
మెదక్‌జోన్: కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. టమాటా నుంచి మొదలుకుని పచ్చి మిర్చి వరకు కిలోకు రూ.60 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. దీంతో వినియోగదారులకు పట్టపగలే చుక్కలు కన్పిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం జిల్లాకు సరిపడా కూరగాయల పంటలు సాగు చేయక పోవటమే. ఫలితంగా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున కూరగాయల దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాయగూరల పంటలపై దృష్టిపెట్టాలని జిల్లా వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇందుకనుగుణంగా ఇక నుంచి కూరగాయల ఉత్పత్తిని పెంచేందుకు పూర్తి సబ్సిడీపై ఐదు రకాల నారుమళ్లను రైతులకు అందించాలని నిర్ణయించింది.
జిల్లాకు 250 ఎకరాలకు నారుమడి
కూరగాయల సాగును పెంచేందుకు మూడేళ్లు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ములుగులో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ యూనివర్సిటీలో పలురకాల కూరగాయల నారుమళ్లు పెంచుతూ రైతులకు సబ్సిడీపై అందిస్తున్నప్పనటికీ జిల్లాకు ఏటా కేవలం 25 ఎకరాలకు సరిపడా నారుమళ్లను అందించేవారు. అయితే 2025–2026 నుంచి జిల్లాకు 250 ఎకరాలకు సరిపడా టమాటా, వంకాయ, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ నారుమళ్లను పూర్తి సబ్సిడీపై రైతులకు అందిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాకు 100 ఎకరాలకు పైగా నారుమడిని తెచ్చుకున్న రైతులు వాటిని సాగు చేశారు. మరో 150 ఎకరాల్లో సాగుచేసేందుకు నారును సిద్ధంగా ఉందని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు.
‘సెడ్‌నెట్’ నిర్మాణానికి భారీ సబ్సిడీ
జిల్లాకు 20 సెడ్‌నెట్‌హౌజ్ యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది ఒక్కో యూనిట్‌ను 12 గుంటల విస్తీర్ణంలో నిర్మించుకునే వీలు ఉంటుంది. దీని నిర్మాణానికి రూ.5 లక్షలు ఖర్చు అవుతుండగా అందులో రూ.3.75 లక్షల సబ్సిడీని ప్రభుత్వం సదరు రైతుకు ఇస్తుంది. రైతు వాటా కింద రూ.1.75 లక్షల వెచ్చించాల్సి ఉంటుంది. కాగా పూర్తి నిర్మాణం తర్వాతనే సదరు రైతుకు సబ్సిడీ వాటా అందుతుంది. ఈ సెట్‌నెట్ హౌజ్‌లో ఏడాదికి రూ.10 లక్షల కూరగాయల దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
ములుగు హార్టికల్చర్ వర్సిటీ నుంచి సరఫరా
జిల్లాకు 250 ఎకరాలకు అవకాశం
తగ్గనున్న కూరగాయల ధరలు!
మెదక్ జిల్లాలో కొన్నేళ్లుగా కూరగాయల సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఇదివరకు కూరగాయల సాగు పెంచేందుకు సబ్సిడీపై కూరగాయల విత్తనాలను అందించేవారు. దీంతో విస్తృతంగా సాగు అయ్యేది. ఫలితంగా జిల్లాలో నాణ్యమైన కూరగాయలు లభించటంతోపాటు వినియోగదారులకు తక్కువ ధరకు లభించేవి. 10 సంవత్సరాల నుంచి విత్తనాలపై సబ్సిడీ తొలగించటంతో చాలామంది రైతులు కూరగాయల పంటలను పండించటం మానేశారు.


