రూ.11.14కోట్లతో ఎక్సలెన్స్ భవనం
● నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి
● ఎంపీ రఘునందన్
హవేళిఘణాపూర్(మెదక్): జిల్లాకు సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనం మంజూరు కావడం అభినందనీయమని ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రోహిత్ అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో రూ.11.14కోట్ల భవన నిర్మాణ పనులను శుక్రవారం కలెక్టర్ రాహుల్‌రాజ్‌లతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ భవనానికి రెండు జిల్లాలు ఎంపికవ్వగా.. మెదక్ ప్రాంతంలోని డైట్ కళాశాలలో ఈ పనులను ప్రారంభించడం హర్షణీయమన్నారు. విద్యార్థులకు కళాశాలతో పాటు వసతి గృహం, డైనింగ్ వంటి పనులు నిర్మాణం చేపట్టడంతో వసతులు మెరుగుపడుతాయన్నారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కళాశాలలో అన్ని వసతులను కల్పించేలా అధికారులు సైతం సమన్వయంతో త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, డైట్ ప్రిన్సిపాల్ రాధాకిషన్, సర్పంచ్ మేకల సాయిలు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు శ్వేతాకిరణ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్, ఆయా గ్రామా ల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
డిప్లొమా ప్రైమరీ ఫ్రీ ఎడ్యూకేషన్ (డీపీఎస్‌ఈ) పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించి ఈ కోర్సులో చేరే విధంగా చూడాలని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం హవేళిఘణాపూర్ డైట్ కళాశాలలో నూతనంగా నిర్మించనున్న భవన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన డైట్ ప్రిన్సిపాల్ రాధాకిషన్‌తో మాట్లాడారు. కళాశాలలో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియాల్లో విద్యాబోధన చేస్తున్నామని, ప్రభుత్వం డీపీఎస్‌ఈ కోర్సు ప్రవేశపెట్టినా ఈ కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. అందుకు ఎంపీ బదులిస్తూ డీపీఎస్‌ఈ ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థుల్లో అవగాహన పెంచి కోర్సులో చేరే విధంగా చూడాలని సూచించారు.


