విద్యావంతులే సైబర్ బాధితులు
● సైబర్ నేరాలపై అవగాహన
● రోడ్డు భద్రతా మాసోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో సైబర్ మోసాలకు గురవుతుంది అధిక శాతం విద్యావంతులేనని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సైబర్ వారియర్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అవగాహన లోపం, అత్యాశ, తొందరపాటు నిర్ణయాలే ఇందుకు ప్రధాన కారణాలని తెలిపారు. విద్యావంతులు, యువత అప్రమత్తంగా ఉండాలని, అనుమానం కలిగిన వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అనధికారిక లోన్ యాప్స్ ద్వారా తక్కువ సమయంలో రుణం ఇస్తామని ఆకర్షించి అధిక వడ్డీలు వసూలు చేయడం, మొబైల్‌లోని కాంటాక్ట్‌లు, ఫొటోలు, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం, రుణం చెల్లించలేని పరిస్థితుల్లో బెదిరింపులు, అశ్లీల సందేశాలు పంపడం, పరువు నష్టం కలిగించడం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఎస్పీ వివరించారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్ నెంబర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు.
రోడ్డు భద్రతా మాసోత్సవాలు
అనంతరం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈనెలంతా రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, సీఐలు సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఆర్‌ఐ శైలేందర్, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు, ఎస్సై శివానందం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


