కరాటే కోచ్‌ల ఎంపిక ప్రక్రియ వాయిదా
● జిల్లా వ్యాప్తంగా 162 పాఠశాలలు
● 250 దరఖాస్తులు
మెదక్ కలెక్టరేట్: సమీకృత కలెక్టరేట్‌లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కరాటే మాస్టర్ల ఎంపిక ఈనెల 6వ తేదికి వాయిదా పడింది. రాణి లక్ష్మిబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ స్వీయ రక్షణ పథకం కింద జిల్లాలోని 162 పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న బాలికలకు కరాటే శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం జిల్లాలోని అర్హులైన మాస్టర్లు దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ నోటిఫికేషన్ ఇచ్చారు. జిల్లాలోని 133 సెకండరీస్కూల్స్, 29 ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యనభ్యసించే బాలికలకు మూడు నెలలపాటు కరాటే శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం డిసెంబర్ 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. దీనిపై స్పందించిన జిల్లాలోని కరాటే మాస్టర్లు 162 పాఠశాలలకు 250 దరఖాస్తులు సమర్పించారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో మాస్టర్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కరాటే మాస్టర్లు తరలిరావడంతో కార్యాలయం కిటకిటలాడింది. అయితే చాలావరకు ఇంకా అనుభవం లేని అభ్యర్థులు రాగా, ఒక్కొక్కరు రెండు, మూడు పాఠశాలలకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇదే సమయంలో కరాటే మాస్టర్లతోపాటు తమను ఎంపిక చేయాలంటూ కుంగ్‌ఫూ మాస్టర్లు రావడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారింది. అధికారులు అభ్యర్థులతో మాట్లాడి వారి నైపుణ్యత ఆధారంగా ఎంపిక చేపట్టారు. దీంతో సాయంత్రం వరకు కేవలం 10 మండలాలకు మాత్రమే కోచ్‌ల ఎంపిక జరిగింది. మిగతా మండలాల అభ్యర్థుల ఎంపిక ఈనెల 6వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ కార్యాలయ అధికారులు జ్యోతి, రాజేశ్వరీ, శ్రీకాంత్‌లు పాల్గొన్నారు.


