సాగు నీరు విడుదల చేయలేం
మెదక్ కలెక్టరేట్: సింగూర్ ప్రాజెక్ట్ మరమ్మతుల కారణంగా వనదుర్గా ప్రాజెక్ట్‌కు నీటి విడుదల ఉండదని, 500 ఎకరాల ఆయకట్టు ఉన్న పొలాలకు నీరిచ్చేందుకు జిల్లావ్యాప్తంగా 9 చెరువులను గుర్తించినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్ అధికారులతో సమావేశంలో నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరు మండలాల్లో గల ఆయకట్టుకు ఈ రబీకి నీటి విడుదల చేయలేకపోతున్నామన్నారు. జిల్లాలో 500 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న నీరు అందించేందుకు 9 చెరువులను గుర్తించినట్లు చెప్పారు. ఆ చెరువుల ద్వారా వాటి పరిధిలోని ఆయకట్టు పొలాలకు నీరందిస్తామన్నారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసే దిశగా చర్యలు జరుగుతున్నట్లు వివరించారు. భవిష్యత్తులో జిల్లాలోని రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈమేరకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉండగా సింగూరు నుంచి ఘనపూర్ అనకట్టకు 4.05 టీఎంసీలు వెంటనే విడుదల చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అడ్వైజరీ మీటింగ్‌ను బహిష్కరించి రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. నీటి విడుదల చేయని పక్షంలో సాగు చేయలేక నష్టపోయే రైతులకు ఎకరాకు రూ. 25,000 చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధించే వరకు మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్


