ఉపాధిలో అవినీతిని ఉపేక్షించం
డీఆర్‌డీఓ శ్రీనివాస్
రామాయంపేట(మెదక్): మండలంలోని ఓ గ్రామంలో ఉద్యోగి కుటుంబం ఉపాధి పనుల్లో పాల్గొంటున్నట్లు వస్తున్న ఆరోపణల విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఆర్‌డీఓ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఎంపీపీ కార్యాలయ ఆవరణలో జరిగిన ఉపాధి పథకం సోషల్ ఆడిట్‌లో పాల్గొని మాట్లాడారు. ఏడాది కాలంగా మండలంలో రూ. ఆరుకోట్ల మేర ఉపాధి పనులు నిర్వహించగా, పది రోజులుగా గ్రామాల్లో ఆడిట్ జరిగిందన్నారు. ఒకరి పేరిట మరొకరు పనుల్లో పాల్గొంటున్నట్లు ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయని, పలు గ్రామాల్లో ఇలా జరిగినట్లు తమ దృష్టికి సైతం వచ్చిందన్నారు. ఇష్టం వచ్చినట్లు చేయడం తగదని, నిబంధనల మేరకే పనులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈమేరకు పలు అవకతవకలకు సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి రూ. 11 వేలు రికవరీ చేయడంతో పాటు రూ. 18 వేలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్, పలు గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.


