గణితంపై ఆసక్తి పెంచుకోవాలి
మెదక్ కలెక్టరేట్: విద్యార్థి దశలోనే గణితం పట్ల అభిరుచిని పెంచుకోవాలని, ఈసారి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో గణిత టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. చిన్నప్పుడు టాలెంట్ టెస్ట్‌లో కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతిభా వంతులైన విద్యార్థులు వెనుకబడిన విద్యార్థులకు సహకరించాలని కోరారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సమగ్ర శిక్ష అధికారులు నవీన్, రాజు, టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


