ముగిసిన ధాన్యం సేకరణ
● 3.78 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు
● రూ. 901. 66 కోట్ల చెల్లింపులు
మెదక్‌జోన్: వానాకాలం ధాన్యం సేకరణ పూర్తయ్యింది. సెప్టెంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొదట్లో వర్షాల వల్ల కొంత ఆటంకం జరిగింది. అనంతరం జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాలు ప్రారంభించారు. ఖరీఫ్ లో 3.95 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో 1.20 లక్షల ఎకరాల్లో సన్నరకం, 2.75 లక్షల ఎకరాల్లో దొడ్డురకం సాగు చేశారు. వాటిలో ఆహార అవసరాలు, విత్తనాలకు పోను 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు పీఏసీఎస్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో 518 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ప్రత్యేకంగా సన్నధాన్యం కోసం 100, దొడ్డు ధాన్యం సేకరణకు 418 సెంటర్లు కేటాయించారు.
రెండు నెలల పాటు..
జిల్లావ్యాప్తంగా రెండునెలల పాటు 3.78 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. అధికారుల అంచనా ప్రకారం కేవలం 2 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే తక్కువగా వచ్చింది. ఇందులో సన్నరకం 1.43 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 2.35 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం సేకరించారు. ఇందుకు సంబంధించి క్వింటాల్ ధాన్యానికి రూ. 2,389 లెక్కన రూ. 903.14 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా, మంగళవారం వరకు రూ. 901.66 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.1.48 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఆ చెల్లింపులు సైతం పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు.
బోనస్ రూ. 45.85 కోట్లు
సన్నాలకు ప్రభుత్వం అదనంగా క్వింటాల్‌కు రూ. 500 చెల్లిస్తుండటంతో ఈ ఏడాది 1.20 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇందుకు సంబంధించి 1.43 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం విక్రయించారు. క్వింటాల్‌కు రూ. 500 చొప్పున రూ. 71.6 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.45.85 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి. ఇంకా రూ. 25.75 కోట్లు బకాయిలు ఉన్నాయి. మరో వారం రోజుల్లో పూర్తి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
గతేడాదివి పెండింగ్..
ఈ ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణతో పాటు డబ్బుల చెల్లింపులు సైతం చకచకా జరిగినప్పటికీ, గత రబీ సీజన్‌కు సంబంధించిన బోనస్ రూ.31.37 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ డబ్బుల కోసం రైతులకు ఎదురు చూపులు తప్పటం లేదు. అప్పటి చెల్లింపులు సక్రమంగా జరిగి ఉంటే మరింత మంది రైతులు సన్నాలు సాగు చేసే వారని పలువురు పేర్కొంటున్నారు.


