న్యూ జోష్‌కు రెడీ
తుప్రాన్: 2025కి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జిల్లావ్యాప్తంగా చిన్నాపెద్ద సిద్ధమయ్యారు. ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా యువత పార్టీలు, దావత్‌లు అంటూ ఫుల్ జోష్ మీద ఉన్నారు. కొంతమంది ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీసులు కోరుతున్నారు. డ్రంకెన్ డ్రైవ్ వంటివి చేయొద్దని, హద్దు మీరితే అవస్థలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
కొంగొత్త ఆశలతో..
కాలగర్భంలో మరో ఏడాది నేటితో గడిచిపోనుండగా కొంగొత్త ఆశలతో నూతన ఆంగ్ల సంవత్సరాదికి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. న్యూ ఇయర్‌కు కావాల్సిన కేకులు, స్వీట్లు, బిర్యానీలకు గిరాకీ ఉండడంతో మార్కెట్లో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అలాగే ఇళ్ల ముంగిటలో వేసే రంగవల్లులు అబ్బుర పర్చనున్నాయి. ఇప్పటికే కొంతమంది వీటికి కావాల్సిన రంగులను కొనుగోలు చేశారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువర్గంతో సంబురాలు జరుపుకొనేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
భలే ఆఫర్లు..
న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని ముందస్తుగానే ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేశారు. చికెన్, మటన్, ఫిష్ బిర్యానీలతో పాటు జంబో, ఫ్యామిలీ ప్యాక్‌లతో ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బుకింగ్ నడుస్తున్నాయి. కేక్‌లు, స్వీట్ల కొనుగోలుకు గిరాకీ పెరిగింది. మద్యం దుకాణాలు సైతం అదే స్థాయిలో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా యువత సంబురాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉండటం విశేషం.
2025కు వీడ్కోలుపలికేందుకు అంతా సిద్ధం
ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లు
జాగ్రత్తలు సూచిస్తున్న పోలీసులు


