యూరియాపై ఆందోళన వద్దు
● సాగుకు సరిపడా నిల్వలు
● కలెక్టర్ రాహుల్ రాజ్
కొల్చారం(నర్సాపూర్): జిల్లాలో సాగుకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన పడవద్దని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆగ్రో సేవా కేంద్రం, పీఏసీఎస్‌ను తనిఖీ చేశారు. సంబంధిత కేంద్రాల్లో ఎరువుల నిల్వలపై ఆరా తీయడంతో పాటు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ... అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే ఇప్పటికే 12,673 యూరియా జిల్లాకు వచ్చిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో అక్టోబర్ నెల నుంచి 28 డిసెంబర్ వరకు 7,343 మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు జరగగా, ఇంకా జిల్లాలో 5,146 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఫర్టిలైజర్ యాప్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత యాప్ ద్వారా రైతులు ఎన్ని బస్తాలు కావాలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్ చారి, కౌడిపల్లి ఏడీఏ పుణ్యవతి, ఏఈఓలు, రైతులు ఉన్నారు.
పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురావొద్దు
మెదక్ కలెక్టరేట్: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు నా కోసం కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వారు పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకొని రావద్దని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా చలి నుంచి రక్షణ పొందేందుకు దుప్పట్లు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. వాటిని త్వరలో విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దుప్పట్లు అందించడం వల్ల వారి ఆరోగ్య రక్షణకు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.


