కలిసిరాని కాలం
రైతులకు ఈ ఏడాది కష్టాలు, కడగండ్లు ఎదురయ్యాయి. భారీ వర్షాలు ఆగమాగం చేయగా, చెరువులు, కుంటలు తెగి పంటలు నీటి పాలయ్యాయి. వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. సకాలంలో యూరియా దొరకక రైతులు పడరాని పాట్లు పడ్డారు. తీరా పంటలు చేతికొచ్చే సమయంలోనూ వర్షాలు పడటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. సన్నధాన్యానికి ప్రభుత్వం బోనస్ అందజేస్తుండటంతో కొంత ఊరట కలిగింది.
– మెదక్‌జోన్
జిల్లాలో 2025 సంవత్సరం వ్యవసాయానికి కలిసి రాలేదు. యాసంగిలో 2.96 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా మార్చి, ఏప్రిల్, మేలో కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు సుమారు 1,507 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతి న్నాయి. ఇందులో సింహభాగం వరి కాగా, రెండో స్థానంలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. వేలాది కాయలు నేలరాలాయి. నష్టాన్ని అంచనా వేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించినా పైసా పరిహారం రాలేదు.
ఆగస్టులో ముంచేసింది
ఇక వానాకాలంలో 3.26 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన అతిభారీ వర్షాలకు నీటి వనరులు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలు తెగిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం 10,769 ఎకరాల్లో వివిధ రకాల పంటలు ధ్వంసం అయినట్లు ఆశాఖ అధికారులు తేల్చి చెప్పారు. వీటిలో 2 వేల ఎకరాలకుపైగా పొలాల్లో ఇసుక మేటలు కప్పేశాయి. ప్రభుత్వం పరిహారం కింద ఇన్‌పుట్ సబ్సిడీ పేరిట ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. ఈ లెక్కన బాధిత రైతులకు రూ. 12.27 కోట్లకు పైగా అందాల్సి ఉండగా, ఇప్పటివరకు పైసా మంజూరు చేయలేదు.
పంట పొలాల్లో ఇసుక మేటలు
భారీగా వచ్చిన వరదలతో 1,200 ఎకరాలకు పైగా పంటపొలాల్లో ఇసుక మేటలు కప్పేశాయి. దీంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బోరుబావుల్లో మోటార్లు పడిపోవటంతో మరింత నష్టం జరిగింది. ఇసుక మేటలను తొలగించేందుకు రైతులు ఎకరాకు రూ. 50 నుంచి రూ. 70 వేల వరకు ఖర్చు చేశారు. ఇది ఎక్కువగా మంజీరా, హల్దీవాగు పరివాహాక ప్రాంతంతో పాటు కామారెడ్డి–మెదక్ జిల్లాల సరిహద్దులో గల పోచారం ప్రాజెక్టు దిగువన గల పోచమ్మరాల్, జక్కన్నపేట, సర్దన, హవేళిఘణాపూర్ తదితర గ్రామాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.
చెరువులకు మరమ్మతులు కరువు
భారీ వరదల కారణంగా తెగిన చెరువులకు మరమ్మతులు చేసేందుకు నేటికీ పైసా విడుదల కాలేదు. దీంతో రాయినిపల్లి ప్రాజెక్టు ఆయకట్టు కింద 3 వేల ఎకరాలు, మెదక్ మండల పరిధి అవుసులపల్లి చెరువు కింద 100 ఎకరాలు, హవేళిఘణాపూర్ పెద్ద చెరువు కింద 220 ఎకరాలు, ఇదే మండలం అనంతసాగర్ ఊర చెరువు వెనకాల 50 ఎకరాల చొప్పున 3,320 ఎకరాలు బీళ్లుగా మారాయి.
ఘనపూర్ కింద క్రాప్ హాలిడే!
సింగూరు ప్రాజెక్టు పరిధిలో గల పాపన్నపేట మండలం ఘనపూర్ ప్రాజెక్టు కింద 25 వేల ఎకరాల పైచిలుకు ఆయకట్టు ఉంది. ఏటా రెండు పంటలు సాగవుతుండగా, ఈ ఏడాది సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల నేపథ్యంలో ప్రాజెక్టు నుంచి నీటిని వదిలేసి మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రాజెక్టు కింద సాగయ్యే పంటలకు క్రాప్ హాలిడేను ప్రకటించారు. దీంతో అన్నదాతల పరిస్థితి ఈ ఏడాది గోటిచుట్టపై రోకలి పోటులా మారింది.
ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది యూ రియా కోసం రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆగస్టులో వరి పంటకు యూరియా వేయాలి. ఆ సమయంలో జిల్లాకు సరిపడా యూరియా రాకపోవటంతో రైతులు రోజులు తరబడి పడిగాపులు కాశారు. యూరియాను సరైన సమయంలో చల్లకపోవడంతో వరి దిగుబడిపై ప్రభావం చూపింది. దీంతో రైతులు నష్టాలు చవిచూశారు.
ఆగమైన ఎవుసం
రైతులను వెంటాడినప్రకృతి వైపరీత్యాలు
జిల్లాలో దెబ్బతిన్న వరి, పత్తి పంటలు
ఇంకా చేతికందని పరిహారం


