నేరాలు పెరిగాయి
● వివిధ కేసుల్లో 8 మందికి జీవిత ఖైదు
● వార్షిక నివేదికను వెల్లడించిన ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: సైబర్ నేరాలు, హత్యలు, అత్యాచారాలతో గతేడాది కంటే ఈఏడాది జిల్లాలో 9.6 శాతం క్రైం రేట్ అధికంగా పెరిగింది. గత సంవత్సరం జిల్లావ్యాప్తంగా 4,871 కేసులు నమోదు కాగా, ఈసారి ఆసంఖ్య 5,388కు పెరిగింది. సోమవారం వార్షిక నివేదికను ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆర్థిక దోపిడీలు, ఆస్తి హత్యలు, దొంగతనాలు, చైన్‌స్నాచింగ్, మోసాలు, హత్యాయత్నాలు వంటి ప్రధాన నేరాలు గతేడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. అలాగే రోడ్డు ప్రమాదాలు 29 శాతం తగ్గుదల నమోదయ్యాయి. డ్రంకెన్ డ్రైవ్ , ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలతో రోడ్డు ప్రమాద మ రణాలు గణ నీయంగా తగ్గాయని స్పష్టం చేశారు. గతేడాది డీడీ (ఈఈ) కేసులు 6,500 నమోదు కాగా, ఈ సంవత్సరంలో 11,800 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 2024లో గేమింగ్ యాక్ట్ కింద 38 కేసులు నమోదు కాగా, 265 మంది అరెస్టు చేసి రూ. 9.70 లక్షలు సీజ్ చేశారు. ఈ ఏడాది 73 కేసులు నమోదు చేసి 472 మందిని అరెస్టు చేశారు. రూ. 18 లక్షల 18 వేల నగదు సీజ్ చేశారు. మిస్సింగ్ కేసులు సైతం గతేడాది 397 నమోదు కాగా, ఈసారి ఆ సంఖ్య 454కు పెరిగింది. వివిధ కేసుల్లో 8 మందికి జీవిత ఖైదు విధించారు.
సంచలనం సృష్టించిన కేసులు
కొల్చారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పైతరకు చెందిన అనిల్ పాత కక్షల నేపథ్యంలో తుపాకి తూటా కు బలయ్యాడు. ఈ ఏడాది జూలైలో జరిగిన ఈ సంఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే కొల్చారం మండలం పొతంశెట్టిపల్లి శివా రు ఏడుపాయల దారిలో గిరిజన మహిళా కూలీపై జరిగిన హత్యాచారం సంచలన కేసుగా నమోదైంది. ఈ కేసును పోలీసులు వారం రోజుల్లో చేధించారు. జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రంలో గల ఐటీసీ కంపెనీలో రూ. 15 లక్షల విలువైన వస్తువుల చోరీ కేసు సైతం జిల్లాలో సంచలనంగా మారింది.
రెండేళ్లలో జరిగిన నేర వివరాలివి..
నేరాలు 2024 2025
హత్యలు 28 30
ఆస్తి హత్యలు 13 04
కిడ్నాప్‌లు 41 44
అత్యాచారాలు 48 56
రోడ్డు
ప్రమాదాలు 636 598
మృతులు 350 247
క్షతగాత్రులు 625 598
సైబర్ నేరాలు 809 762
కోల్పోయిన
డబ్బులు 4,28,67,672 3,73,16,252
రికవరీ 2,95,19,044 60,04,588
కట్టడి చేశాం
జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పటిష్టమైన బందోబస్తుతో నిర్వహించడంలో కీలకపాత్ర పోషించాం. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేశాం. జిల్లాలో ఐదు విడతలుగా లోక్ అదాలత్‌లు నిర్వహించి 1,827 కేసులు పరిష్కరించాం. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడంలో ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాం. ప్రజలు పోలీస్‌శాఖతో కలిసి పనిచేసినప్పుడే శాంతియుత, సురక్షిత సమాజం సాధ్యమవుతుంది.
– డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ


