పల్లెల్లో జీవనోపాధి కేంద్రాలు
● ఉపాధి నిధులతో వర్క్‌షెడ్ల నిర్మాణం
● భవనానికి రూ. 10 లక్షల కేటాయింపు
● ఉత్తర్వులు, మార్గదర్శకాలుజారీ చేసిన ప్రభుత్వం
పెద్దశంకరంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది. గ్రామీణ మహిళల కోసం ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాతీయ ఉపాధి హామీ పథకం (వీజీ– జీరాంజీ) ద్వారా ప్రతీ గ్రామంలో రూ.10 లక్షలతో వర్క్‌షెడ్‌ల నిర్మాణానికి అనుమతిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 13,256 ఎస్‌హెచ్‌జీ గ్రూపులు ఉండగా, 1,37,256 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికి జిల్లాలోని 902 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు దుస్తులు కుట్టే పనితో పాటు పలు పథకాల కింద మహిళలకు స్వయం ఉపాధిని ప్రభుత్వం కల్పిస్తోంది. మహిళా సంఘాలు టెస్కో ద్వారా వచ్చిన వస్త్రాలను సంఘం సభ్యుల ద్వారా కుట్టి విద్యార్థులకు అందజేస్తున్నారు. ఈ విధానంలో పలు సమస్యలు రావడంతో మహిళా సమాఖ్యలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో పాటు పలు అంశాలపై ప్రభుత్వం కసరత్తు నిర్వహించి దుస్తులు కుట్టడంతో పాటు ఆహార శుద్ధి, ఇతర జీవనోపాధి అవకాశాలను అందించేందుకు వర్క్‌షెడ్‌ల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.
ప్రతీ గ్రామంలో ఏర్పాటు
జిల్లావ్యాప్తంగా ప్రతీ గ్రామంలో మహిళా సమాఖ్య సభ్యులకు వర్క్‌షెడ్‌లు నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. 200 చదరపు గజాల స్థలంలో భవనం నిర్మించనున్నారు. ఇందులో విశాలమైన హాల్‌తో పాటు టాయిలెట్లు, రెండు తలపులు, 6 కిటికీలు, ఆరు సీలి ంగ్ ఫ్యాన్‌లు, 8 ట్యూబ్‌లైట్లు, 7 ఫ్లోర్‌సెంట్ లైట్లు ఉండాలని సూచించింది. ఈ భవన నిర్మాణం కోసం ఉపాధి హామీ నిధులను వినియోగించనున్నారు.
గ్రామసభల తీర్మానం తప్పనిసరి
ప్రతీ గ్రామంలో వర్క్‌షెడ్‌ల నిర్మాణానికి గ్రామసభల తీర్మానం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్క్‌షెడ్‌ల నిర్మాణం కోరుతూ మహిళా సమాఖ్యలు పంచాయతీకి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఈ తీర్మానాలను ఎంపీడీఓకు అందజేయాలి. వారు స్థల పరిశీలన అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల ద్వారా కలెక్టర్‌కు సమర్పిస్తారు. కలెక్టర్ ఆదేశానుసారం ఉపాధి హామీ సామగ్రి వాటా నిధులతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వర్క్‌షెడ్‌లు నిర్మించాల్సి ఉంటుంది. ఈ భవనాలు నిర్మితమైతే మహిళా సమాఖ్య సభ్యులకు గ్రామాల్లోనే ఉపాధి దొరుకుతుంది.


