యూరియా సరిపడా ఉంది
● రైతులకు అవసరానికి అందిస్తాం
● కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ముందస్తు చర్యల్లో భాగంగా ఈనెల 28 నాటికి 12,673 మెట్రిక్ టన్నుల జిల్లాకు చేరుకున్నట్లు చెప్పారు. జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేకుండా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే 7,343 మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు జరగగా, ఇంకా జిల్లాలో 5,330 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు. అనంతరం రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌లో కలెక్టర్ గన్‌మెన్ ప్రభాకర్‌గౌడ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రజిత పతకం సాధించగా, కలెక్టర్ అభినందించారు.ఇదే స్ఫూర్తి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ప్రజావాణి కి 64 అర్జీలు
అంతకు ముందు జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా నలుమూలల తరలివచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై 64 అర్జీలు సమర్పించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుక కొనుగోలు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రభుత్వ నిర్మాణాల కోసం అవసరమైన ఇసుకను సాండ్ బజార్‌లో నిల్వ చేస్తామని తెలిపారు. త్వరలోనే మెదక్‌లో సైతం సాండ్ బజార్ ప్రారంభిస్తామన్నారు. ఎక్కడ ఇసుక అక్రమ రవాణా జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


