నీటి విడుదలపై స్పష్టత ఇవ్వండి
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి
మెదక్ కలెక్టరేట్: సింగూరు నీటి విడుదలపై రైతులకు స్పష్టత ఇవ్వాలని, లేదా క్రాప్ హాలిడే ప్రకటించి నష్ట పరిహారం చెల్లించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనకట్టకు నీటి విడుదలపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారని తెలిపారు. ప్రతి పంటకు సాగు నీరందించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. వానాకాలం నష్ట పరిహారం ఇప్పటివరకు రైతులకు చెల్లించలేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. అనంతరం సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొండల్‌రెడ్డిని పరామర్శించారు. ఆమె వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లతో పాటు నాయకులు ఉన్నారు.
సాగు నీరు విడుదల చేయలేం
జిల్లాలో యాసంగికి సింగూరు నీరు విడుదల చేయలేమని ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగూరు పాజెక్టు మరమ్మత్తుల దృష్ట్యా ఘనపూర్ ఆనకట్టకు సాగునీరు విడుదల చేయ లే మని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పరిధిలోని కొల్చారం, పాపన్నపేట, మెదక్, హవేళిఘణాపూర్ మండలాల్లోని ఆయకట్టు రైతులు గమనించి సహకరించాలని కోరారు. మరింత సమాచారం కోసం 7093604017, 8977750785 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


