వరినాట్లపై చలి పంజా
మెదక్‌జోన్: అన్నదాతలకు యాసంగి ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. గత 15 రోజు లుగా జిల్లాలో ఉష్ణోగత్రలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాయి. దీంతో వరి నాటు వేసిన పొలాలు చలికి దెబ్బతింటున్నాయి. జిల్లావ్యాప్తంగా రబీలో 3,17,380 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో 2,95,200 ఎకరాల్లో వరి, 22,180 ఎకరాల్లో కూరగాయలతో పా టు ఆరుతడి పంటలు సాగు కానున్నట్లు పేర్కొన్నారు. కాగా జిల్లాలో చెప్పుకోదగిన సాగునీటి ప్రాజెక్టులు లేకపోవటంతో బోరుబావుల ఆధారంగానే రైతులు పంటలు సాగు చేస్తున్నారు. కాగా ముందుగా నాట్లు వేస్తే బోరుబావుల్లో నీటి ఊటలు తగ్గక ముందే మార్చిలో పంటలు చేతికందుతాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే 40 వేల ఎకరాల్లో వరిసాగు చేసినట్లు సమాచారం. అయితే వేసిన నాట్లు ఏ మాత్రం ఎదగకపోగా, చలి తీవ్రతకు నాటంతా చనిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి హైబ్రిడ్ విత్తనాలు కొనుగోలు చేసి నాట్లు వేస్తే చనిపోతున్నాయని వాపోయారు. మళ్లీ దున్ని నాట్లు వేద్దామంటే నారు లేదని, మళ్లీ తుకాలు పోద్దామంటే పుణ్యకాలం గడిచిపోతుందని ఆవేదన చెందుతున్నారు.
ఎదుగుదల లేక దెబ్బతింటున్నపంటలు
యాజమాన్య పద్ధతులుపాటించాలంటున్న అధికారులు


