‘కొండ’ంత సమస్యలు
కొండపోచమ్మ జాతర సమీస్తున్నా ఏర్పాట్లు ఏవీ?
గజ్వేల్: తెలంగాణలోనే ప్రసిద్ది చెందిన కొండపోచమ్మ ఆలయం వద్ధ భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. జనవరి 15నుంచి మార్చి 19వ తేదీ వరకు ఆలయంలో జాతర జరగనుండగా లక్షలమందికి అమ్మవారికి చెంతకు వస్తారు. ఇంతటి ప్రాఽ దాన్యత కలిగిన ఆలయానికి ఇప్పటివరకు కమిటీ వేయకపోగా, ఏర్పాట్లపై సన్నాహాలు మొదలుకాలేదు. వాహనాల పార్కింగ్‌కు మొదలుకొని అన్నీ సమస్యలే. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని చెప్పిన పాలకుల హామీలు నీటి మూటలుగానే మిగిలాయి.
కొమురవెల్లి మల్లన్న, జగదేవ్‌పూర్ మండలం తీగుల్–నర్సాపూర్‌లో కొలువుదీరిన కొండపోచమ్మలు అన్నాచెల్లెళ్లని పూర్వకాలం నుంచి చరిత్ర చెబుతోంది. అన్నపై అలిగి... కొండపోచమ్మ తీగుల్‌నర్సాపూర్ గుట్టల్లో దాక్కోగా.. వెతుక్కొని వచ్చి సోదరిని బుజ్జగించిన మల్లన్న.. ఆమె కోరిక మేరకు వరమిస్తాడు. తనను దర్శించుకునే ప్రతి భక్తుడు నీ వద్దకు కూడా వస్తాడని అభయమిస్తాడు. అదే తరహాలో నేడు కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ ఆలయా లు వెలుగొందుతున్నాయి. కొమురవెల్లిని దర్శించే ప్రతి భక్తుడు కొండపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
కమిటీ ఏదీ..?
ఈ ఆలయానికి ఇటీవల కాలం వరకు ఉన్న రెనోవేషన్ కమిటీ గడువు అక్టోబర్ 19నాటికి ముగిసింది. తర్వాత కొత్త కమిటీ ఏర్పాటు ఊసే లేదు. జాతర సమీపిస్తున్న వేళ ఏర్పాట్లపై కనీసం సన్నాహాలు కూ డా మొదలుకాకపోవడం ఆలయంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు
ఆలయానికి దాతలు సమకూర్చిన కొన్ని గదుల్లో తప్పా మిగితా చోట్ల ఎక్కడా తాత్కాలికంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయలేదు. దీంతో ఖాళీ స్థలాల్లో ఉండే భక్తులకు మల విసర్జనకు నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రైవేట్‌గా కూడా సౌకర్యం లేకపోవడంతో భక్తులు వాహనాలు తీసుకుని కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు.


