అదనపు డబ్బులు చెల్లించాల్సిందే
మెదక్ కలెక్టరేట్: లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆశవర్కర్లతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖ అధికారులు ఆశవర్కర్లతో అదనపు పనులు చేయించుకుంటున్నారని, డబ్బులు విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. అదనపు పనికి, అదనపు డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వం ఆశవర్కర్లను మోసం చేయాలని చూస్తుందన్నారు. నేటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి కనీస వేతనం చెల్లించడం లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న పల్స్‌పోలియో, స్థానిక ఎన్నికల డ్యూటీ డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. ప్రతి ఆదివారం, పండగలకు సెలవులు ఇవ్వాలన్నారు. ఫిక్స్‌డ్ వేతనం రూ.18,000తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సంతోశ్, ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి సావిత్రి, సిబ్బంది పాల్గొన్నారు.


