
మట్టి ప్రతిమలు ప్రతిష్ఠించాలి
మెదక్ కలెక్టరేట్: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీలు, భక్తులు మట్టి గణనాథులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ కాలుష్య రహిత వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి.. సాంప్రదాయ బద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఏదైనా సమస్యలుంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా స్థానిక లైన్‌మెన్‌ను సంప్రదించాలని కోరారు.
అప్రమత్తంగా ఉండండి
రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం జాతీయ స్థాయిలో కరాటే పోటీల్లో ప్రతిభ కనబర్చిన నితన్యసిరిని ఆయన అభినందించారు. పోస్టల్ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ కోసం మంజూరైన 111 సెల్‌ఫోన్లు, వేలిముద్ర యంత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, బీసీ సంక్షేమ అధికారి జగదీష్ పాల్గొన్నారు.
పకడ్బందీగా జ్వర సర్వే
పాపన్నపేట(మెదక్): సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. మంగళవారం పాపన్నపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణ ధ్యేయంగా జిల్లాలోని ఆసుపత్రులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. సమయపాలన పాటిస్తూ రోగలకు సరైన వైద్యసేవలు అందజేయాలని చెప్పారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
2 వేల గణేశ్ ప్రతిమల పంపిణీ