
జలసిరి.. సాగుకు ఊపిరి
చిన్నశంకరంపేట మండలంలో పచ్చని వరి పొలాలు
ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ముఖం చాటేసిన వరుణుడు.. చివరలో కరుణించాడు. గడిచిన రెండు నెలల్లో జిల్లాలో మైనస్ వర్షపాతం నమోదు కాగా, పంటల సాగు ఆశించిన మేర ముందుకు సాగలేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందారు. ఈ నెలలో ఐదు రోజుల పాటు కురిసిన వర్షాలు పంటలకు ఊపిరిపోయగా, నీటి వనరులు నిండుకుండలా మారాయి.
– మెదక్‌జోన్
జిల్లాలో గడిచిన జూన్, జూలై మాసాల్లో అడపాదడపా కురిసిన వర్షం సాధారణం కంటే తక్కువగా నమోదు అయింది. దీంతో ఆరుతడి పంటలతో పాటు బోరుబావుల వద్ద మాత్రమే రైతులు వరి నాట్లు వేశారు. ఆశించిన మేర వ్యవసాయ పనులు సాగక అన్నదాతలు ఆందోళన చెందారు. నారు ముదిరిపోతుందని ఆవేదన చెందారు. ఈక్రమంలో ఈనెల 17 నుంచి 21 వరకు కేవలం ఐదు రోజుల పాటు జిల్లాలోని పలు మండలాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో జిల్లాలోని 2,632 చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. కొన్నిచోట్ల పంటలు నీట మునగగా, కొద్దికొద్దిగా తేరుకుంటున్నాయి.
పంటలకు ఢోకా లేదిక
ఇటీవల కురిసిన వర్షాలతో ఈ సీజన్‌తో పాటు రాబోయే రబీకి సైతం ఎలాంటి ఢోకా లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఏకై క మధ్య తరగతి ప్రాజెక్టు ఘనపూర్‌తో పాటు హల్దీ, మంజీరా, రాయిపల్లి ప్రాజెక్టు, అతిపెద్ద చెరువు కొంటూర్, అంబాజీపేట లాంటి పెద్ద చెరువులు నిండుకుండలా మారాయి. జిల్లావ్యాప్తంగా 21 మండలాలు ఉండగా, 11 మండలాల్లో అధికంగా వర్షం కురిసింది. 5 మండలాల్లో అత్యధికంగా, మిగితా ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ లెక్కలు చెబుతున్నాయి.
అత్యధిక వర్షపాతం నమోదు
ఈఏడాది వర్షాకాలంలో జూన్, జూలైలో సాధారణం కన్నా 31 మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువగా నమోదు అయింది. ఫలితంగా పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. ఈనెలలో రెండు వందలకు పైగా మిల్లీమీటర్ల వర్షం అధికంగా కురిసింది. ఫలితంగా పంటల సాగు ఊపందుకోగా, భూగర్భజలాలు సైతం గణనీయంగా పెరిగాయి. కొన్నిచోట్ల బోరుబావుల్లో నుంచి నీరు పైకి ఉబికిరావటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వర్షపాతం వివరాలు (మి.మీ)
నెల కురవాల్సింది కురిసింది
జూన్ 112.4 81.7
జూలై 206.6 199.1
ఆగస్టు 159.8 395.5
కలిసొచ్చిన వర్షాలు
నిండుకుండలా నీటి వనరులు
జిల్లాలో 3.29 లక్షల
ఎకరాలు సాగులోకి..
రెండు పంటలకు సమృద్ధిగా నీరు