మసక చీకట్లో ఇసుక దోపిడీ!
పాటిగడ్డ కేంద్రంగా ఆగని దందా
రాత్రి 3 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు రవాణా
గాడిద కష్టం.. దళారుల అదృష్టం! ● సీజ్ చేసిన ఇసుక కుప్పలు మాయం
పొలాల్లో ఇసుక కుప్పల నిల్వలు
పాపన్నపేట(మెదక్): గాడిద కష్టం.. దళారుల అదృష్టం అన్నట్లుంది ఇసుకాసురుల తిరకాసు దందా. జల వనరులను పరిరక్షించాల్సిన ఖద్దరు నాయకులే మంజీరా పాలిట జలగల్లా మారారన్న ఆరోపణలున్నాయి. స్థలం మార్చి.. అధికారులను ఏమార్చి మంజీరా నదిని ఎడారిగా మార్చే యత్నం చేస్తున్నారు. రాత్రి 3 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు దర్జాగా దందాను కొనసాగిస్తున్నారు. యూసుఫ్‌పేట శివారులోని పాటిగడ్డ కేంద్రంగా గాడిదలపై సాగుతున్న ఇసుక రవాణా దళారులకు కాసుల వర్షం కురిపిస్తుంది.
ఖద్దరు బట్టల చాటున వ్యాపారం
వేసేది తెల్లబట్టలు.. చేసేది చీకటి వ్యాపారం అన్నట్లుంది ఇసుక అక్రమ దందా తీరు. పాపన్నపేట మండలం చుట్టూ మంజీరా నది ఉండటంతో వర్షాకాలంలో భారీగా ఇసుక మేటలు పెడతాయి. దీంతో వేసవి రాగానే అక్రమార్కులు ఇసుక దందాకు తెరలేపుతారు. గతంలో ట్రాక్టర్లపై ఇసుక రవాణా చేసేవారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు కేసులు నమోదు చేస్తుండడంతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రస్తుతం గాడిదలపై ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 6 వేలు వస్తుండటంతో ప్రధాన పార్టీల నాయకులు ఇసుక దందాలో పాలుపంచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
అధికారుల మొక్కుబడి దాడులు
పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రమే పోలీస్, రెవెన్యూ అధికారులు దాడులు చేసి డంపులు సీజ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. సీజ్ చేసిన ఇసుక కుప్పలకు ఓపెన్ టెండర్ నిర్వహించి, డబ్బులను డిపాజిట్ చేయాలి. కాని అవేవి చేయకపోవడంతో గతంలో సీజ్ చేసిన ఇసుక కుప్పలను అక్రమార్కులు యథేచ్ఛగా కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. ఒక వేళ టెండర్లు నిర్వహించినా, లోలోపల తతంగం అయిందనిపించి దళారులే వాటిని మొక్కబడి ధరలకు సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పాటిగడ్డ ఇసుక దిబ్బగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అధికారులు గాడిదల యజమానులను అక్కడి నుంచి కుర్తివాడకు తరలించగా, యూసుఫ్‌పేట వ్యాపారులు తిరిగి వారిని రప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై తహసీల్దార్ సతీష్ కుమార్‌ను వివరణ కోరగా.. పాటిగడ్డపై నిఘా పెట్టి ఇసుక అక్రమ రవాణా అడ్డుకొని, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
స్థలం మార్చి.. అధికారులను ఏమార్చి
యూసుఫ్‌పేట శివారులోని పాటిగడ్డ ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణాపై ఇటీవల ‘సాక్షి’లో కథనాలు రావడంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడులు చేసి ఇసుక కుప్పలను సీజ్ చేశారు. దీంతో దళారుల కన్ను సంగమేశ్వర్‌రెడ్డి పొలం దగ్గర గల పాటిగడ్డపై పడింది. అక్కడ నాణ్యమైన ఇసుక ఉండటంతో నదిలోకి ప్రత్యేక రోడ్డు వేశారు. గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి వరకు గల కొందరు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు గాడిదలపై ఒడ్డు వరకు ఇసుక తరలిస్తున్నారు. అక్కడి నుంచి సమీప పొలాల వరకు ట్రాక్టర్లపై రవాణా చేసి, అక్కడ నిల్వ చేస్తున్నారు. ఇందుకు గాను గాడిదల యజమానులకు రూ. 1,500, ట్రాక్టర్‌లో ఇసుక లోడ్ చేసే లేబర్‌కు రూ. 500 చెల్లిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 5,500 నుంచి రూ. 6 వేల వరకు బయట అమ్ముకుంటున్నారు.
మసక చీకట్లో ఇసుక దోపిడీ!


