ఖరీఫ్ ప్రణాళిక ఖరారు
వానాకాలం సీజన్‌లో
3.50 లక్షల ఎకరాల్లో సాగు
● 3 లక్షల పైచిలుకు ఎకరాల్లో వరి
● ఈసారి సన్నాలు పెరిగే అవకాశం?
● ఉన్నతాధికారులకు నివేదిక అందజేత
మెదక్‌జోన్: వానాకాలం సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు ఖరారు చేశారు. ఈనెల 19న సాక్షి దినపత్రికలో ‘ఖరారు కానీ ఖరీఫ్ ప్రణాళిక‘ అనే కథనం ప్రచురితం కావటంతో స్పందించిన అధికారులు పంటల ప్రణాళికను సిద్ధం చేశారు. సరిపడ ఎరువులు, విత్తనాలపై ఉన్నతాధికారులకు సైతం నివేదిక అందజేశారు.
ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల పంటలు 3,50,164 ఎకరాల్లో సాగు కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అందులో సింహాభాగం వరి ఏకంగా 3,05,100 ఎకరాల్లో సాగు కానుంది. 2వ స్థానంలో పత్తి 37,200 ఎకరాల్లో సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. వరి, పత్తి పంటలు 3,42,300 ఎకరాల్లో సాగు అవుతుండగా మిగతా 7,864 ఎకరాల్లో మాత్రమే ఇతర పంటలు సాగవనున్నాయి. కాగా గత 2024 వానాకాలం సీజన్‌లో వరి, పత్తితో పాటు అన్ని రకాల పంటలు 3,43,399 ఎకరాల్లో సాగు కాగా ఈ ఏడు 6,765 ఎకరాల్లో అధికంగా సాగవుతుంది. పంటల సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాల ప్రణాళికను ఉన్నతాధికారులకు నివేదించారు.
గణనీయంగా పెరగనున్న సన్నాలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 వానాకాలం సీజన్ నుంచి సన్నాలు సాగు చేసిన రైతులకు అదనంగా క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తోంది. దీంతో రైతులు సన్నాల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్‌లో వరి 3,05,100 ఎకరాల్లో సాగు కానుండగా అందులో 40శాతం సన్నాలను వేసే అవకాశం ఉంది. అంటే 1.20 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అంతే కాకుండా మరో 50 వేల ఎకరాలకు పైగా వరి విత్తనాలను సాగు చేసే అవకాశం లేకపోలేదు. కొంత కాలంగా జిల్లాలో పలు రకాల వరి విత్తన కంపెనీలు రైతులతో సాగు చేయిస్తున్నారు. ఒక్కో ఎకరాకు రూ. 70 వేల నుంచి రూ.లక్ష వరకు సదరు కంపెనీలు రైతుకు ఇచ్చి సాగు విత్తనాలను పండిస్తున్నారు. దీంతో రైతులు విత్తనాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టితో కానీ పంటలు దెబ్బతింటే సదరు కంపెనీ రైతుతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పరిహారం అందజేస్తారు. దీంతో రైతులు వరి విత్తన సాగును విరివిగా పండిస్తున్నారు.
వర్షాధారంగానే పత్తి సాగు
వానాకాలం అత్యధికంగా సాగయ్యే పంటల్లో పత్తి పంట రెండవది. జిల్లా వ్యాప్తంగా 37,200 ఎకరాల్లో సాగు అవుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇది ఎక్కువగా జిల్లాలోని పెద్దశంకరంపేట, రేగోడు, అల్లాదుర్గ్, టేక్మాల్ మండలాల్లో సాగవుతుంది. ఈ పంటను పూర్తిగా వర్షాధారంగా సాగు చేయటం గమనార్హం. సాగు చేసే రైతులకు పంట చేతికందే వరకు నమ్మకం ఉండదు. అతివృష్టి , అనావృష్టితో పాటు పంట చేతికందే దశలోనూ వర్షం కురిస్తే పత్తి నల్లబడి పోయే ప్రమాదం ఉంది. ఈ పంట సాగు చేయటానికి ప్రధాన కారణం సరైనా సాగునీటి సౌకర్యం లేక పోవడమేనని రైతులు చెబుతున్నారు.
పంటల సాగు ఎకరాల్లో..
వరి 3,05,100
పత్తి 37,200
మొక్కజొన్న 2,640
కందులు 1,500
పెసర్లు 1,500
మినుములు 550
జొన్నలు 100
రాగులు 40
ఆముదం 120
సోయాబీన్ 140
చెరుకు 50
నల్లజొన్నలు 60
కూరగాయలు 708
ఆయిల్ పామ్ 456
విత్తనాలు క్వింటాళ్లు
వరి 91,530
పత్తి (ప్యాకెట్స్) 74,400
కందులు 90
మొక్కజొన్న 264
జొన్నలు 6
మినుములు 33
పెసర్లు 90
ఎరువులు మెట్రిక్ టన్నుల్లో
యూరియా 25,000
డీఏపీ 1,912
ఎంఓపీ 2,118
కాంప్లెక్స్ 28,400
ఎస్‌ఎస్‌పీ 615
ఖరీఫ్ ప్రణాళిక ఖరారు


