2.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు: ఆర్డీఓ
తూప్రాన్: డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో 2.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు జరిగాయని ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం తూప్రాన్‌లో ఓ రైస్‌మిల్లును పరిశీలించి ధాన్యం సేకరణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనోహరాబాద్ మండలంలోని పోతారంలో వరి కోతలు ఇంకా మొదలుకాలేదని చెప్పారు. చేగుంట మండలంలో అత్యధికంగా సుమారు లక్ష క్వింటాళ్ల ధాన్యం సేకరించామన్నారు. వెల్దుర్తి మండలంలో 65 వేల క్వింటాళ్లు, నార్సింగిలో 44,267, మాసాయిపేటలో 16,351, తూప్రాన్‌లో 17,112 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్లు వివరించారు. డివిజన్‌లోని రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ వడ్ల కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు డబ్బులు జమ అయ్యే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నట్లు తెలిపారు.


