ఉపాధిలో అవినీతి ఊట | - | Sakshi
Sakshi News home page

ఉపాధిలో అవినీతి ఊట

May 1 2025 7:29 AM | Updated on May 1 2025 7:29 AM

ఉపాధిలో అవినీతి ఊట

ఉపాధిలో అవినీతి ఊట

సోషల్‌ ఆడిట్‌తో వెలుగులోకి..

మెదక్‌జోన్‌: జాతీయ ఉపాధి హామీ పనుల్లో అ వినీతి ఊట ఊరుతోంది. ఏడాది పాటు చేసిన పనులకు సంబంధించి నిర్వహించిన సోషల్‌ ఆడిట్‌తో అసలు విషయం బయటపడుతోంది. మొన్న నర్సాపూర్‌ మండలంలో క్షేత్రస్థాయి అధికారులు తప్పుడు రికార్డులు సృష్టించి రూ. 9.50 లక్షలు స్వాహా చేస్తే.. నిన్న శివ్వంపేట మండలంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌తో పాటు మరికొంత మంది సిబ్బంది రూ. 2.90 లక్షల అవినీతికి పాల్పడినట్లు తేలింది.

జిల్లాలో రూ. 163.65 కోట్లు విడుదల

జిల్లాలో గతేడాదికి సంబంధించి ఉపాధి పనుల కోసం రూ. 163.65 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వాటిలో రూ. 102.55 కోట్లు కూలీలు చేసిన పనుల నిమిత్తం విడుదల కాగా, సిమెంట్‌ రోడ్లు, కోళ్లు, గొర్రెల ఫాంలు, పశువుల పాకలు, నర్సరీల్లో మొక్కల పెంపకం, ప్లాస్టిక్‌ బ్యాగులు.. తదితర సామగ్రి కోసం మరో రూ. 61.10 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో 98 శాతం పనులు పూర్తి చేశారు. కాగా ఉపాధి పనులకు సంబంధించి ఏడాదికోసారి జిల్లాలోని అన్ని గ్రామాలో సోషల్‌ ఆడిట్‌ నిర్వహిస్తారు. అనంతరం మండల కేంద్రాల్లో ప్రజాదర్బార్‌ ఏర్పాటుచేసి ఒక్కో గ్రామంలో ఎన్ని పనులు చేశారు..? ఎంతమంది కూలీలు పనులు చేశారు.. వారికి చెల్లింపులు, మెటీరియల్‌ పనులకు సంబంధించి చెల్లింపులు ఎంత అనే వివరాలు ప్రజల సమక్షంలో వెల్లడిస్తారు. ఇందులో ఎలాంటి తప్పులు దొర్లినా వెంటనే సంబంధిత అధికారులను దోషులుగా నిలబెడతారు. అక్రమంగా డ్రా చేసిన డబ్బులను రికవరీ చేయడంతో పాటు జరిమానా సైతం విధిస్తారు.

మొన్న నర్సాపూర్‌..

నిన్న శివ్వంపేటలో

జిల్లాలో ఇప్పటివరకు నర్సాపూర్‌, శివ్వంపేట మండలాల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. అయితే ఆ రెండు మండల్లాల్లో అవినీతి బయటపడింది. నర్సాపూర్‌ మండలంలోని అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పథకంలో నాటని మొక్కలను నాటినట్లు.. వాటికి ఏడాది పాటు నీరు పోసినట్లు.. అవి పెరిగి పెద్దగా అయినట్లు ఫారెస్ట్‌ అధికా రులు రూ. 9.50 లక్షల అవినీతికి పాల్పడినట్లు ప్రజాదర్బార్‌లో గుర్తించారు. అలాగే గత నెల 29వ తేదీన శివ్వంపేట మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో గోమారం గ్రామానికి చెందిన ఫీల్డు అసిస్టెంట్‌తో పాటు మరో క్షేత్రస్థాయి అధికారి కలిసి రూ. 2.90 లక్షల అవినీతికి పాల్పడినట్లు తేలింది. అవినీతికి పాల్పడిన సొమ్ముతో పాటు అందుకు రూ. 32 వేల జరిమానాతో కలిపి వెంటనే చెల్లించాలని సంబంధిత ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా జిల్లాలో 21 మండలాలు ఉండగా, ఇప్పటివరకు 2 మండలాల్లో మాత్రమే ఈ సోషల్‌ ఆడిట్‌ జరిగింది. మిగితా 19 మండలాల్లో త్వరలో నిర్వహించనున్నారు. వాటిలో ఎంత అవినీతి బట్టబయలుకానుందోనని పలువురు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement