అభ్యర్థులు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

అభ్యర్థులు సహకరించాలి

Nov 17 2023 4:26 AM | Updated on Nov 17 2023 4:26 AM

జిల్లా సాధారణ పరిశీలకుడు పృథ్వీరాజ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని జిల్లా సాధారణ పరిశీలకుడు పృథ్వీరాజ్‌ కోరారు. గురువారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల నాయకులు, పోటీచేసే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని, నియమావళిని తప్పక పాటించాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తుందని తెలిపారు. అభ్యర్థులు కొత్త బ్యాంక్‌ అకౌంట్‌ తీసుకోవాలని, ఆ అకౌంట్‌ నుంచి రోజుకు పదివేల కంటే ఎక్కువ డ్రా చేసుకోవద్దని జిల్లా వ్యయ పరిశీలకుడు సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఖర్చుల విలువలు ఈసీఐ ధరల సూచి విలువల ప్రకారం వర్తిస్తాయని చెప్పారు.

అన్నీ అభ్యర్థుల ఖాతాలోనే..

ఎన్నికలలో దాతలుచేసే సహాయ సహకారాలు, ఎన్నికల ఖర్చులు, అభ్యర్థుల ఖాతాలో జమ అవుతాయని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా తెలిపారు. ఈ నెల 18న మెదక్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో, నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీలలో రెండో రాండమైజేషన్‌ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. డమ్మీ బ్యాలెట్‌ తయారు చేసుకునే వారు వారి గుర్తులు మాత్రమే డమ్మీ బ్యాలెట్‌లో పెట్టుకోవాలని, ఏదైనా సమస్యలుంటే సీ విజిల్‌, 1950లో ఫిర్యాదు చేయాలని చెప్పారు.

ప్రచారాన్ని అడ్డుకుంటే ఫిర్యాదు చేయండి

ఎన్నికలలో అభ్యర్థుల ప్రచారాన్ని ఎవరైనా అడ్డుకున్నా, ఘర్షణలు జరిగినా 100కు కాల్‌చేసి ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ టీంలలో ఉండే పోలీసు అధికారులు వాటిని పరిష్కరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, మెదక్‌ ఆర్‌ఓ అంబదాస్‌ రాజేశ్వర్‌, ఎన్నికల నోడల్‌ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ పార్టీల అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement