మంచిర్యాల నగరంలో పేరుకే నాటుతున్న వైనం
సంరక్షణ మరవడంతో ఎండిపోతున్నవే ఎక్కువ
ఏటా లక్షల్లో నాటినా కనిపించవు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో ఏటా వర్షాకాలంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. సంరక్షించక పోవడంతో కొన్ని ఎండిపోతుండగా, మరికొన్ని చోట్ల నాటకుండానే నాటినట్లుగా లెక్కల్లో చూపిస్తుస్తున్నారు. దీంతో నగరంలో పచ్చదనం కరువవుతోంది. లక్షలాది మొక్కలు నాటినట్లుగా రికార్డుల్లో నమోదవుతున్నా వాస్తవంగా అవేమీ కనిపించని పరిస్థితి నెలకొంది. వనమహోత్సవం పేరిట వర్షాలు కురిసిన వెంటనే ఎంతో ఉత్సాహంగా పాలకవర్గాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటేందుకు, ఇళ్లల్లో పంపిణీకి చూపిస్తున్న ఉత్సాహం మొక్కల సంరక్షణపై చూపడం లేదు. దీంతో హరితహారం లక్ష్యం నీరుగారుతోంది.
రూ.లక్షల్లో నిధులు
గత ప్రభుత్వం హరితహారం పేరిట మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతియేటా మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్‌లో 10శాతం గ్రీన్ బడ్జెట్‌గా తప్పనిసరిగా కేటాయించాలని నిర్ణయించింది. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల వార్షిక బడ్జెట్‌లో 10శాతం పార్కులు, నర్సరీలు, పచ్చదనం అభివృద్ధికి కచ్చితంగా కేటాయించి, మిగతా 90శాతాన్ని ఇతర పరిపాలన అవసరాలకు కేటాయిస్తున్నారు. గ్రీన్ బడ్జెట్ పేరిట ఏటా పది శాతం నిధులు కేటాయిస్తున్నా అందుకు తగినట్లుగా పచ్చదనం పెంపొందడం లేదు. 2019నుంచి హరితహారం కోసం మున్సిపల్ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తూ వస్తున్నారు. 2019–20లో రూ.15లక్షలు, 2020–21లో రూ.92 లక్షలు, 2021–22లో రూ.2.62 కోట్లు, 2022–23లో రూ.65 లక్షలు, 2023–24లో రూ.3.24 కోట్లు, 2024–25లో రూ.3.29 కోట్లు, 2025–26లో రూ.4.76 కోట్లు కేటాయించారు. రెండేళ్ల క్రితం 2.15లక్షల మొక్కలు, గతేడాది 2.45లక్షల మొక్కలు, ఈ ఏడాది 5.96లక్షల మొక్కలు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటారు.
నిధులు వృథా
2025–26 ఆర్థిక సంవత్సరంలో నగరంలో 5.96 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్ధేశించగా.. 5.96 లక్షల మొక్కలు నాటినట్లుగా లెక్కల్లో చూపించారు. అందులో 3.18 లక్షల మొక్కలు ఇళ్లల్లో నాటేందుకు ప్రతీ ఇంటికి ఆరు చొప్పున పంపిణీ చేశారు. ఇళ్లల్లో నాటారా లేదా అని అధికారులు, పాలకులు పట్టించుకోలేదు. గతంలో ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన, మున్సిపల్ ఖాళీ స్థలాల్లోనూ మొక్కలు నాటారు. మొక్కలు పెంచి, నాటినందుకు, ట్రీగార్డుల కోసం రూ.25 లక్షల వరకు ఖర్చు చేశారు. రోడ్ల పక్కన నాటిన మొక్కలను పశువులు తినడం, నీరు పోయక ఎండిపోయి పచ్చదనం మా యమైంది. నిధులు లక్షల్లో ఖర్చు చేసినా నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోకపోవడంతో వనమహోత్సవం పేరిట చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమం వృథాగా మారుతోంది. నిధులు వృథా అవుతున్నాయి. ఏటా కనీసం లక్ష మొక్కలు నాటేలా చూసినా నగరంలో పచ్చదనం పెంపొందుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నగరంలో హరితహారంలో నాటిన
మొక్కలు, ఖర్చు చేసిన నిధులు
సంవత్సరం లక్ష్యం నాటినవి నిధుల ఖర్చు
(రూ.లక్షల్లో)
2023–24 2,15,000 2,15,000 324.40
2024–25 2,45,000 2,45,000 329.14
2025–26 5,96,400 5,96,400 476.56


