‘ఖాతా’ర్నాక్ సమస్య..!
మంచిర్యాలక్రైం: క్రికెట్ బెట్టింగ్, సైబర్ క్రైం, మనీల్యాండరింగ్, ఆన్‌లైన్ ట్రేడింగ్ లావాదేవీలతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమాత్రం సంబంధం లేకపోయినా కొందరి బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నాయి. అనుమానాస్పద లావాదేవీలే కారణమని తెలిసి ఖాతాను పునరుద్ధరించుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, బెంగళూర్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో కేసు నమోదైన పోలీసుస్టేషన్ నుంచి ఎన్‌వోసీ(నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్) తీసుకు రావాలంటూ బ్యాంకు అధికారులు సూచిస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంత దూరం వెళ్లలేక ఖాతాలను వదిలేసుకుంటున్నారు. చిరు వ్యాపారులు, ఉద్యోగుల ఖాతాలు నెలలకొద్దీ ఫ్రీజ్ అయి ఉండడంతో అప్పటికే ఖాతాలో ఉన్న నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు బ్యాంకు, పోలీసు సిబ్బంది కొందరు మామూళ్లు తీసుకుని ఫ్రీజ్ అయిన ఖాతాలను తెరిపించే దందా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏటీఎం కేంద్రాల వద్ద
బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అవుతున్న వారిలో ఆన్‌లైన్ లావాదేవీల తర్వాత ఎక్కువ మంది ఏటీఎం కేంద్రాల వద్ద మోసపోతున్న వారే ఉన్నారు. నగదు జమ కోసం వచ్చిన వారితో కొందరు క్రికెట్ బుకీ ఏజెంట్లు మాట కలుపుతున్నారు. బంగారం కొనేందుకు వెళ్తే దుకాణదారులు నగదు రూపంలో అడుగుతున్నారని, నగదు ఇస్తే చెప్పిన ఖాతాలో తమ మిత్రుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా జమ చేస్తారని చెబుతున్నారు. సులభంగా పని అవుతుండడంతో కొందరు నగదు ఇచ్చి ఆన్‌లైన్‌లో జమ చేయించుకుంటున్నారు. సదరు క్రికెట్ బుకీలు ఎప్పుడైన పోలీసులకు పట్టుబడితే వారి ఖాతాలను పరిశీలించినప్పుడు వారితో ఏమాత్రం సంబంధం లేని నగదు అందజేసిన వ్యక్తి ఖాతాలు కూడా ఫ్రీజ్ అవుతున్నాయి. నగదు ఉపసంహరణ సమయంలో తాము నగదు ఇస్తామని, మిత్రుడి ఖాతాకు ఫోన్ పే చేయాలని చెబుతున్నారు. వేచి ఉండకుండానే వెంటనే నగదు మార్పిడి అవుతుందన్న ఉద్దేశంతో కొందరు అపరిచితులతో లావాదేవీలు చేస్తున్నారు.
ఎఫ్‌ఐఆర్ నమోదైన చోటుకు వెళ్లాల్సిందే..
అపరిచితులతో నగదు మార్పిడి వల్ల ఖాతాలు ఫ్రీజ్ అయినవారు తిరిగి పునరుద్ధరించుకోవాలంటే ఎక్కడ ఎఫ్‌ఐఆర్ నమోదైతే అక్కడి పోలీసుస్టేషన్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఉత్తర భారతదేశంలోని స్టేషన్లకు వెళ్లలేక కొత్త ఖాతాలు తెరిచిన సందర్భాలు లేకపోలేదు. ఖాతాలు స్తంభించిన సమయంలో తామేమీ చేయలేమని బ్యాంకు సిబ్బంది చేతులెత్తేస్తుండంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేసు నమోదైన స్టేషన్‌కు వెళ్లి ఎన్‌ఓసీ తీసుకు రావాలని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు.


