బాసర/దండేపల్లి: కార్తిక మాసం సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. శుక్రవారం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్దయెత్తున తరలి రావడంతో బాసర ఆలయం, గోదావరి నదీ తీరం కిటకిటలాడింది. తెల్లవారు జాము నుంచే గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలు చేసి నదిలో పసుపు, కుంకుమ, నైవేద్యాలు సమర్పించారు. కార్తిక దీపాలను నదిలో వదిలి మొక్కులు తీర్చుకున్నారు. జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. నదీ తీరంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బాసర ఎస్‌హెచ్‌వో దీపక్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేశారు. స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్, ఆలయ వేద పండితులు, అర్చకులు తెల్లవారుజామున అమ్మవారికి వేదమంత్రోచ్ఛారణల మధ్య అభిషేకం, ప్రత్యేక అర్చన, మహాహారతి పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా అసౌకర్యం కలుగకుండా ఆలయ ఈవో అంజనీదేవి ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
బాసర: గోదావరి నది వద్ద శివునికి పూజ చేసి దీపాలు వెలిగిస్తున్న భక్తులు
దండేపల్లి: కార్తిక దీపాలు వెలిగిస్తున్న భక్తులు
గూడెం ఆలయంలో..
దండేపల్లి: దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తిక సందడి మొదలైంది. శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సత్యదేవుణ్ని దర్శించుకున్నారు. పలువురు భక్తులు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. ప్రత్యేక పూజలతోపాటు కార్తికదీపాలు వెలిగించారు. ఆలయ ప్రాంగణాలు భక్తులతో రద్దీగా కనిపించాయి.


